Jagadish Reddy: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల పంచాయితీ ముదురుతోంది. పల్నాడు వాటర్ గ్రిడ్ వ్యవహారం రాజకీయాల్లో హీట్ పెంచేసింది. నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ వాటర్ గ్రిడ్ పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు. పల్నాడు వాటర్ గ్రిడ్ తో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వంపై కేఆర్ఎంబీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సొరంగ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని కేఆర్ఎంబీ చైర్మన్ ను డిమాండ్ చేశారు. కేంద్రం, కేఆర్ఎంబీ స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌ను కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్‌పై ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నాయకుల బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం మాజీమంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు అబద్ధాలకు అంతే లేదు అని ధ్వజమెత్తారు. 3 నెలల్లో 30 లక్షల మంది 9 TMCల నీళ్లు తాగుతున్నారంటే.. ఇంతకుమించిన అబద్ధం ఇంకొకటి ఉండదన్నారు. మరి.. రెండున్నర కోట్ల మంది ఉన్న మేము సంవత్సరం పాటు ఎలా బతకాలి? హైదరాబాద్ నగర పరిస్థితి ఏంటి? హైదరాబాద్ సహా నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పరిస్థితి ఏంటి?
''ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రపంచంలో కొంచెం జ్ఞానం ఉన్న వాడికి ఎవడికైనా తెలుసు. 3 నెలల్లోనే 30 లక్షల మంది 9 టీఎంసీల నీళ్లు తాగుతారని అంటే ఇంతకు మించిన అబద్ధం ఇంకోటి ఉండదు. మరి రెండున్నర కోట్ల మంది ఉన్న మేము ఇంకో సంవత్సరం ఎలా బతకాలి? హైదరాబాద్ నగరం పరిస్థితి ఏంటి? రంగారెడ్డి పరిస్థితి ఏంటి? మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలో పరిస్థితి ఏంటి? చంద్రబాబు సమాధానం చెప్పాలి.
కృష్ణా, గుంటూరు జిల్లాలకు నీళ్లు ఎలా తీసుకుపోతారు?
9 టీఎంసీల నీళ్లు కేవలం మనుషులకే పోతాయా? ఇందులో అన్నింటికంటే ప్రధానమైన విషయం పట్టిసీమ. దాని ద్వారా గోదావరి నీళ్లు 80 టీఎంసీలు తెచ్చుకుంటామని చెప్పారు. 80 కాకపోతే ఈ సంవత్సరం వచ్చిన 750 టీఎంసీలు గోదావరిలో వాళ్ళు వాడుకున్నారు. పట్టిసీమ వచ్చిన తర్వాత ఇంకా నూజివీడుకి సాగర్ నుంచి మంచి నీళ్లు ఎలా తీసుకపోతారు? కృష్ణా, గుంటూరు జిల్లాలకు మంచి నీళ్లు ఎలా తీసుకుపోతారు? ఇంతకు మించిన దుర్మార్గం ఏమైనా ఉంది? ఇంతకు మించిన అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? కేఆర్ఎంబీని మోసం చేయడం తప్ప.
నాగార్జున సాగర్ పై కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులు కట్టే హక్కులు ఏపీకి లేవు
వాస్తవానికి పట్టిసీమ తీసుకున్ననాడే సాగర్ పైన మేమిక ఒక్క ప్రాజెక్టు కూడా కట్టము అని చెప్పి రాసిచ్చి పట్టిసీమకు అనుమతి తీసుకున్నారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు తీసుకొచ్చి మొత్తం కృష్ణా జిల్లాకు గుంటూరు జిల్లాలకు వాడుతున్నారో అప్పటినుంచే నాగార్జున సాగర్ పైన ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులు కట్టే హక్కులు లేవు. 40 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువున మాకు ఇస్తారని చెప్పారు కాబట్టే మేము పాలమూరు-రంగారెడ్డి, పాలమూరు-డిండి ప్రాజెక్టులు కూడా కట్టుకున్నాం. ఆ పైనున్న ప్రాజెక్టులు ఏదైనా సరే తెలంగాణకు హక్కు ఉంది. ఎందుకు అంటే మాకు కృష్ణా తప్ప ఇంకొకటి లేదు. కానీ మీకు గోదావరి నుంచి నీళ్ళ వస్తున్నాయి. తెలిసి కూడా చంద్రబాబు మోసం చేశారు. కనీస సమాచారం ఇవ్వలేదు'' అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
