తెలంగాణ

TG: టూరిజం కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి- ప్రభుత్వానికి ఏఐటీయూసీ వినతి

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

TG: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్‌ ని సంఘం నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచాలి

కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. టూరిజం ప్లాజా ఉద్యోగులు, ఏజెన్సీ సిబ్బంది, రోజువారీ వేతన ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరారు.

ఇంక్రిమెంట్లను తిరిగి పునరుద్ధరించాలి

గతంలో ఉద్యోగులకు కల్పించిన బస్ పాస్‌ సౌకర్యాన్ని, తెలంగాణ ఇంక్రిమెంట్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.

తర్వాత చదవండి