తెలంగాణ

కల్తీగాళ్ల కక్కుర్తి.. పాల నుంచి స్వీట్ల దాకా అదే దారి! హైదరాబాద్ లో ఏం తినలేమా..?

8 నిమిషాల పఠనం

హైదరాబాద లో కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. పాల నుంచి స్వీట్ల దాకా అంతటా కల్తీయే. తాాజాగా స్వీట్లపై వాడే సిల్వర్ ఫాయిల్ ను కూడా కల్తీ చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు మహానగరంలో మనం ఏం తినలేమా..?

స్వీట్లపై మెరిసేదంతా వెండి కాదు...

కల్తీగాళ్ల అల్యూమినియం మాయాజాలం

హైదరాబాద్ లో దారుణం

పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ కల్తీ దందా

మహా నగరంలో ఏం తినలేమా..?

పెద్ద స్వీట్ హౌజ్ కు వెళ్లాం. ఎంచక్కా కాజు కట్లీ కొనుక్కొని తిన్నాం. మనం.. కాజు కట్లీ కొన్నప్పుడు దానిపై కనిపించే వెండి రంగు రేకు నిజంగా వెండితో తయారైందా? లేక మనకు తెలియకుండానే అల్యూమినియం తింటున్నామా? హైదరాబాద్‌లో పోలీసులు బయటపెట్టిన ఈ వ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది. అవును.. హైదరాబాద్ మహా నగరంలో కల్తీగాళ్లు బరితెగిస్తున్నారు. పాల నుంచి స్వీట్ల దాకా.. మసాలల నుంచి నిత్యావసరాల దాకా.... అంతటా కల్తీ మాయాజాలమే. స్వీట్లపై అందంగా మెరిసిపోయే వెండి పూతను కూడా కల్తీ చేస్తున్నారన్న విషయం తాజాగా బయటపడింది.

హైదరాబాద్ లోని చార్మినార్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో నకిలీ వెండి రేకులు తయారు చేస్తున్న నాలుగు కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు మెరుపు దాడులు చేశాయి. అక్కడ.. నిజమైన వెండికి బదులుగా తక్కువ ధరకు లభించే అల్యూమినియంను ఉపయోగించి, దానిని వెండి రేకుల మాదిరిగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి, నాలుగు కేసులు నమోదు చేశారు.

సిల్వర్ వర్క్ చాలా హెల్దీ

మార్కెట్లో దొరికే కాజు కట్లీ, కాజు రోల్స్, చమ్ చమ్ వంటి స్వీట్లపై పలుచని వెండి రేకును అలంకరణ కోసం ఉపయోగిస్తారు. దీనినే సిల్వర్ వర్క్ లేదా వెండి వరఖ్ అంటారు. స్వీట్లకు ఆకర్షణీయమైన రూపం రావడంతో పాటు, సంప్రదాయంగా కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదని కూడా చెబుతుంటారు. అయితే.. ఈ నకిలీ తయారీ కేంద్రాల్లో అసలు వెండిని ఉపయోగించకుండా అల్యూమినియం ఫ్లేక్స్‌తో వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజమైన వెండి రేకుల్లా కనిపించేలా తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. స్వీట్లపై వెండి పూత ఉందని నమ్మి కొనేశామా.. ఇక మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడన్నమాట.

ఈ దందా కేవలం స్వీట్లకే పరిమితమైందనుకుంటే పొరపాటే. కేకులపై లుక్ కోసం ఉపయోగించే సిల్వర్ కోటెడ్ షుగర్ బాల్స్ తయారీలోనూ అల్యూమినియం వాడుతున్నట్లు తేలింది. జర్దా, ఖీవామ్, ఫ్లేవర్డ్ పాన్, స్వీట్ పాన్ వంటి ఉత్పత్తుల్లోనూ అల్యూమినియం ఫ్లేక్స్ ఉపయోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది

యూపీ నుంచి ఇంపోర్ట్

ఈ అల్యూమినియం ఫ్లేక్స్‌ను యూపీ నుంచి తెప్పిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పండుగల సీజన్ లో స్వీట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భారీ మొత్తంలో ముడి పదార్థాలను సేకరిస్తున్నారు. వాటితో తయారు చేసిన నకిలీ రేకులను రాష్ట్రంలోని స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో లోకల్ దుకాణాలతో పాటు ప్రముఖ స్వీట్ షాపులకు కూడా సరుకు వెళ్లినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది.

నిజమైన వెండి రేకులు ఎలా ఉంటాయి..?

మరి.. స్వీట్లు, కేకులపై వాడే నిజమైన వెండి రేకులు ఎలా ఉంటాయి..? వాటిని గుర్తించడం ఎలా..? ఈ ప్రశ్న కూడా కీలకమే. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం ఎడిబుల్ సిల్వర్ లీఫ్‌లో వెండి క్వాలిటీ.. కనీసం 99.9 శాతం ఉండాలి. అంటే వెండి పేరుతో అల్యూమినియం రేకులను తయారు చేసి ఆహార పదార్థాలపై ఉపయోగించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతేకాదు.. ఈ కేంద్రాలు సరైన FSSAI లైసెన్సులు లేకుండానే దందా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ స్వీట్లు తింటే మన పని ఖతం

అల్యూమినియం కడుపులోకి వెళితే ఇంకేమైనా ఉందా..? ప్రాణాలు పోతాయి. అవును ఇది అంత డేంజర్. అల్యూమినియం పదార్థాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు, నాడీ వ్యవస్థపై ప్రభావం, ఎముకలకు సంబంధించిన సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

హైదరాబాద్ లో ఏం తినలేమా..?

అసలు.. హైదరాబాద్ లో కల్తీ కానిది ఏదైనా ఉందా..? ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఉదయం మనం తాగే ఛాయ్ దగ్గరి నుంచి రాత్రి తినే అన్నం దాకా ఎక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుందో తెలియడం లేదు. పాలు కల్తీ, టీ పౌడర్ కల్తీ, కిరాణ సరుకులు కల్తీ, నూనెలు కల్తీ, కూరగాయలు కల్తీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కల్తీమయమే.

ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో దాడులు చేస్తున్నప్పుడు దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. అసలు ఏ మాత్రం పరిశుభ్రత పాటించని కిచెన్లు వేలల్లో కనిపిస్తున్నాయి. అవే హోటళ్లకు మనం వెళ్తున్నాం. వేలకు వేలు పెట్టి తింటున్నాం. రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. చిన్న హోటళ్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు ఇదే దందా. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలి. ఆహారాన్ని కల్తీ చేసే కంత్రీగాళ్లపై కఠినమైన కేసులు పెట్టాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ప్రజలు కూడా ప్రతిది ఆలోచించే తినాలి. బయట దొరుకుతుందంతా నాణ్యమైనదని అస్సలు ఊహించకండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.

#sweets#duplicate silver foils#food adultration#hyderabad food#public health
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి