Gold Insurance : బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, లక్షలు పోసి కొన్న నగలను ఇంట్లో దాచుకోవాలంటేనే సామాన్యులకు కంటి మీద కునుకు పట్టడం లేదు. ఊరెళ్లినా, ఇంట్లో ఉన్నా దొంగల భయం వెంటాడుతూనే ఉంటుంది. కారుకు, ఇంటికి, ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లే.. ఇప్పుడు మీ బంగారు ఆభరణాలకు కూడా గోల్డ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ టెన్షన్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అసలు బంగారానికి బీమా ఎలా తీసుకోవాలి? ఏమైనా జరిగితే డబ్బులు ఎలా తిరిగి వస్తాయో వివరంగా తెలుసుకుందాం.
నగలకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చే రెండు మార్గాలు..
మీ ఇంట్లోని బంగారు ఆభరణాలను సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రధానంగా రెండు రకాల బీమా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్. కేవలం బంగారు నగల కోసమే ప్రత్యేకంగా తీసుకునే పాలసీ ఇది. దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం లేదా అనుకోకుండా జరిగే నష్టాల నుంచి ఇది మీ నగలకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. రెండోది హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్. ఇది మీరు ఇప్పటికే ఇంటి బీమా తీసుకుని ఉంటే, దానికి అదనంగా కొంత ప్రీమియం చెల్లించి జ్యువెలరీ కవర్ జోడించుకోవచ్చు. ఉదాహరణకు HDFC ERGO హోమ్ షీల్డ్ వంటి పాలసీల్లో ఈ సదుపాయం ఉంటుంది. అయితే, కేవలం హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బంగారం ఆటోమేటిక్‌గా కవర్ కాదనే విషయం గుర్తుంచుకుని, ప్రత్యేకంగా నగలను పాలసీలో యాడ్ చేయించుకోవాలి.
పాలసీ తీసుకోవాలంటే ఏం కావాలి? క్లెయిమ్ ఎలా చేసుకోవాలంటే..
మీ నగల విలువను ముందుగా అంచనా వేయించి, దానికి తగినట్లు బీమా తీసుకోవాలి. ఇందుకోసం బంగారం కొనుగోలు బిల్లులు, వాల్యుయేషన్ సర్టిఫికెట్, ఆభరణాల స్పష్టమైన ఫొటోలు, గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు దొంగతనం జరిగితే, ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ (FIR) కాపీ తీసుకోవాలి. ఆ వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇచ్చి ఎఫ్ఐఆర్, బిల్లులు, పాలసీ పత్రాలు అందజేస్తే.. కంపెనీ సర్వేయర్ విచారణ జరిపి, పాలసీ రూల్స్ ప్రకారం మీకు పరిహారం అందిస్తారు.
ఈ పొరపాట్లు చేయకండి..
నగలు దొంగతనానికి గురైనట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. కేవలం "ఇంట్లో పెట్టిన నగలు కనిపించడం లేదు" అని చెబితే చాలా పాలసీలు పరిహారం ఇవ్వవు. బంగారం కొన్న బిల్లులు, నగల బరువు, స్వచ్ఛత వివరాలు, ఫొటోలు కచ్చితంగా దాచుకోవాలి. ఆధారాలు లేకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. మొత్తానికి బంగారం కొనేటప్పుడే బిల్లులను జాగ్రత్తగా దాచుకుని, దానికి తగిన జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లక్షలు పెట్టి కొన్న మీ బంగారానికి పూర్తి భద్రత లభించినట్లే.


