TG : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఆత్మలోనూ, గుండెల్లోనూ తెలంగాణ లేదని, అందుకే ఆమె ఆత్మకథలో రాష్ట్ర ప్రస్తావన కనిపించలేదని వ్యాఖ్యానించారు.
భిక్ష కాదు.. ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఎవరో పెట్టిన భిక్ష కాదని, ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగానే సాకారమైందని కేటీఆర్ పేర్కొన్నారు. నాడు ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ కోణంలోనే చూసిందని విమర్శించిన కేటీఆర్.. ఉద్యమ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని ఆయన వ్యాఖ్యానించారు.
మూసీ, కాళేశ్వరం, భూముల ఆరోపణలపై విమర్శలు
ఈ ఇష్టాగోష్టిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రాజెక్టులపైనా కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. మూసీ నదిలో పది టీఎంసీల నీరు పోస్తామని ప్రభుత్వం చెబుతోందని, కరవు పరిస్థితుల్లో సుందరీకరణ కంటే ఆ నీటిని హైదరాబాద్ ప్రజల అవసరాలకు ఇవ్వడం మంచిదని ఆయన సూచించారు. కేసీఆర్ మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ మాత్రమే సాధించగలిగిందని ఆయన విమర్శించారు.
డీపీఆర్‌లు వెనక్కు రావడం ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. అసెంబ్లీలో తనపై 8 వేల ఎకరాల భూమి ఉందంటూ సీఎం ఆరోపణలు చేసి రెండు నెలలు గడిచినా వివరాలు ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలు అని ప్రచారం చేసి, చివరకు అది 67 ఎకరాలు మాత్రమేనని ముఖ్యమంత్రే అంగీకరించారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు మర్చిపోయారని, చివరి వంద రోజుల్లో మాయ చేస్తే సరిపోతుందన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.


