IPS Sajjanar: సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తప్పించి వేరే విభాగానికి బదిలీ చేయడంతో సరిపెట్టకూడదని, ఆయన్ను సర్వీస్ నుంచే పూర్తిగా తొలగించాలని బీసీ మహిళా జేఏసీ అధ్యక్షురాలు జయంతి మట్టా డిమాండ్ చేశారు. సజ్జనార్ బదిలీపై హర్షం వ్యక్తం చేసిన ఆమె.. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సి.వి. ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇలాంటి అధికారులను కేవలం అటాచ్మెంట్ పోస్టులకు పరిమితం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే వ్యవస్థ బాగుపడుతుందని ఆమె స్పష్టం చేశారు.
అక్రమాస్తులపై విచారణ జరిపితే సగం సమస్యలు తీరుతాయి
సజ్జనార్ అక్రమాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర హోంశాఖ గానీ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని జయంతి మట్టా కోరారు. పోస్టింగుల విషయంలో ఎస్ఐ, సీఐ, ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారుల వద్ద భారీగా వసూళ్లు జరుగుతాయని ఆమె ఆరోపించారు. సజ్జనార్ ఆస్తుల లెక్కలు తేలిస్తే తెలంగాణలోని సగం సమస్యలను పరిష్కరించవచ్చని వ్యాఖ్యానించారు. పైరవీల ద్వారానే ఆయన మళ్లీ కీలక పోస్టింగ్ తెచ్చుకున్నారని, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ వంటి నేతలు ఇలాంటి అధికారులను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.
2021లో నాపై అక్రమ కేసులు పెట్టి బెదిరించారు..
గతంలో 2021లో సజ్జనార్ సైబరాబాద్ సీపీగా పనిచేస్తున్న సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను జయంతి మట్టా గుర్తుచేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అక్రమ కేసులు బనాయించారని, దీనిపై న్యాయం చేయాలని నాడు సీపీగా ఉన్న సజ్జనార్‌ను కలిస్తే పట్టించుకోకపోగా, తప్పు చేసిన ఆరుగురు కింది స్థాయి అధికారులను (రాజ్‌గోపాల్ రెడ్డి, డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ సుధీర్, ఏసీపీ రఘునందన్, ఎస్ఐ సైదులు, రవీందర్ రెడ్డి) వెనకేసుకొచ్చారని ఆరోపించారు. పైగా, తనపైనే కేసు పెడతావా అంటూ బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి మొక్కు ఫలించింది..
గత ఐదేళ్లుగా సజ్జనార్ కీలక పోస్టింగుల్లో లేకపోవడంతో తామంతా ప్రశాంతంగా ఉన్నామని, మళ్లీ సీపీగా రావడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందానని జయంతి మట్టా తెలిపారు. ఈ నెల 2వ తేదీన తిరుపతి వెళ్లినప్పుడు ఆయన్ను పదవి నుంచి తొలగించాలని మెట్టుమెట్టుకూ మొక్కుకున్నానని, వారం పది రోజుల్లోనే దేవుడు తన కోరిక తీర్చాడని అన్నారు. భవిష్యత్తులో సజ్జనార్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోందని, అధికారంలో ఉన్నప్పుడే ఇలా వ్యవహరిస్తే రాజకీయ నాయకుడిగా మారితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఆయన చేసిన ఎన్కౌంటర్ల వాస్తవికతపైనా అనుమానాలు ఉన్నాయని, కేంద్ర హోంశాఖ ఈ వ్యవహారాలపై దృష్టి సారించాలని కోరారు.


