క్రైమ్

Baby Sale Case Warangal: నాలుగు నెలల పసికందును రూ.2.90 లక్షలకు విక్రయించిన ముఠా అరెస్ట్.. 12 మందిపై కేసు!

నాలుగు నెలల పసికందు.. ఇంకా అమ్మ ఒడిలో వెచ్చదనం, నాన్న చేతిలో ఆప్యాయత కోరుకునే ప్రాయం.. కానీ ఆ పసి హృదయాన్ని కన్నతల్లిదండ్రులు కనికరించలేదు. ఆర్థిక కష్టాల సాకుతో ఆడపిల్ల పోషణే భారంగా భావించారు. పాతకాలపు మూఢత్వం ఒకవైపు.. డబ్బుల కక్కుర్తి మరోవైపు.. వెరసి కన్నబిడ్డనే సంతలో సరుకులా మర్చేసింది.

 నాలుగు నెలల పసికందు.. ఇంకా అమ్మ ఒడిలో వెచ్చదనం, నాన్న చేతిలో ఆప్యాయత కోరుకునే ప్రాయం.. కానీ ఆ పసి హృదయాన్ని కన్నతల్లిదండ్రులు కనికరించలేదు. ఆర్థిక కష్టాల సాకుతో ఆడపిల్ల పోషణే భారంగా భావించారు. పాతకాలపు మూఢత్వం ఒకవైపు.. డబ్బుల కక్కుర్తి మరోవైపు.. వెరసి కన్నబిడ్డనే సంతలో సరుకులా మర్చేసింది. మద్యానికి బానిసైన తండ్రి, కన్నప్రేమను విస్మరించిన తల్లి, పెద్దలుగా దారి చూపాల్సిన తాతయ్య-అమ్మమ్మ.. ఇలా కుటుంబసభ్యులంతా ఆ పసిబిడ్డను బేరానికి పెట్టి రూ.2.90లక్షలకు విక్రయించారు.

 ఈ అమానవీయ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. అయితే, పోలీసుల చొరవతో ఈ ముఠా గుట్టు ఎట్టకేటకు బయటపడింది. వివరాలలోకి వెళ్తే.. హనుమకొండలోని సమ్మయ్య నగర్‌కు చెందిన జి. సుమన్ (28), అఖిల(25) దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండగా, నాలుగు నెలల క్రితం మూడో సంతానంగా మరో ఆడబిడ్డ జన్మించింది. మద్యానికి బానిసైన సుమన్ పనికి వెళ్లకపోవడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ముగ్గురు ఆడపిల్లలను పోషించడం కష్టమంటూ తల్లిదండ్రులు సుమన్, అఖిల, అమ్మమ్మ జి. అమ్మి (48), తాతయ్య డి. భిక్షపతి (55) కలిసి చిన్నారిని అమ్మాలని నిర్ణయించుకున్నారు.

 రెండు నెలల క్రితం మధ్యవర్తులు పి.సాంబయ్య(53), జి.నీల(48), జె.స్వామి(40)లను సంప్రదించారు. స్వామి తన పిన్ని కె.పుష్ప(56) ద్వారా పిల్లలు లేని ఎ.ఐలమ్మల్లు(37), ఆమె సోదరుడు ఎం. రాజు(34)లను కలిశారు. రాజు తన మిత్రుడు, పిల్లలు లేని వరంగల్ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌కు చెందిన క్యాతం దేవేందర్(36)కు రూ.2.90లక్షలకు చిన్నారిని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

 ప్రణాళిక ప్రకారం.. నవంబర్ 21 మధ్యాహ్నం 2గంటలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మొదటి గేటు వద్దకు చిన్నారిని తీసుకొచ్చి, మైదం సుగుణ అలియాస్ స్వరూప (43) ద్వారా కారులో ఉన్న రాజు, ఐలమ్మల్లు, పుష్పలకు అప్పగించారు. రాజు నుంచి సాంబయ్య రూ. 1.90 లక్షలు తీసుకోగా, అందులో రూ.లక్ష అమ్మికి ఇచ్చారు. మిగిలిన రూ.90 వేలను సాంబయ్య, నీల, స్వామి చెరో రూ.30వేలు పంచుకోగా, అమ్మి తన వాటా నుంచి సుగుణకు రూ.2వేలు ఇచ్చింది.

అనంతరం రాజు చిన్నారిని దేవేందర్‌కు అప్పగించి, గతంలో తాను తీసుకున్న రూ. లక్ష అప్పు పోను మిగిలిన రూ. 1.90 లక్షలు తీసుకున్నాడు; దారిలో పుష్పకు రూ.9వేలు ఇచ్చాడు. బంధువులు చిన్నారి గురించి ప్రశ్నించగా, ఎంజీఎం ఆసుపత్రి వద్ద గుర్తుతెలియని మహిళ రూ.20 ఇచ్చి చిన్నారిని తీసుకెళ్లిందని కుటుంబ సభ్యులు కట్టుకథ అల్లారు. సమాచారం అందుకున్న మట్టెవాడ ఎస్ఐ బి.శ్రీనివాస్ బృందం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ప్రతినిధులతో కలిసి దర్యాప్తు చేపట్టింది.

 మంగళవారం రాత్రి సమ్మయ్య నగర్‌లోని అమ్మి ఇంట్లో అమ్మి, అఖిల, సుమన్, భిక్షపతి, సాంబయ్య, నీల, స్వామి, సుగుణలను అదుపులోకి తీసుకున్నారు. స్వామి ఇచ్చిన సమాచారంతో బుధవారం మధ్యాహ్నం దేశాయిపేటలోని దేవేందర్ ఇంట్లో తనిఖీలు చేసి రాజు, ఐలమ్మల్లు, పుష్పలను అరెస్ట్ చేయడంతో పాటు చిన్నారిని క్షేమంగా రక్షించారు. నిందితుల నుంచి రూ.1.75లక్షల నగదు (అమ్మి వద్ద రూ. 98 వేలు, సాంబయ్య వద్ద రూ.25వేలు, నీల వద్ద రూ.30వేలు, స్వామి వద్ద రూ.17వేలు, పుష్ప వద్ద రూ. 5 వేలు), ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పసికందును వరంగల్ ఐసీడీఎస్ సిబ్బంది పర్యవేక్షణలో ఉంచినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.

తర్వాత చదవండి