రాష్ట్రంలో అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మాటల మాటల యుద్ధం కొనసాగుతోంది.ముఖ్యంగా సాగు నీటి ప్రాజెక్టులు, ఏపీ జలదోపిడీ అంశాలపైనే ఈ రెండు పార్టీల నడుమ విమర్శ,ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. కృష్ణా జల్లాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే..కాదు కాదు అధికార పార్టీనే అని గులాబీ నేతలు చెబుతున్నారు.తాజాగా నాగార్జున సాగర్‌లో టన్నెల్ నిర్మించి తాగునీటి గ్రిడ్ ప్రాజెక్టును ఏపీ సర్కార్ నిర్మిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేఆర్ఎంబీ మినట్స్‌పై రచ్చ..
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశపు మినిట్స్ అంశంపై స్పందిస్తూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు అధికార పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంవ్యక్తంచేశారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు ప్రాజెక్టుపై కృష్ణా బోర్డు సమావేశంలో చర్చ జరగలేదని, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
గతంలో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయలేదని, ఇప్పుడు పల్నాడు విషయంలోనూ అదే వైఖరిని అవలంభించిందని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిందని మాజీ మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు.
హరీశ్‌రావుకు ఎంపీ చామల కౌంటర్..
మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆరోపణలు, విమర్శలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన జీవో 56.. 2022 ఫిబ్రవరి 16నే జారీ అయిందని,ఈ ప్రాజెక్టు ఇప్పుడే మొదలైనట్లు హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చామల వెల్లడించారు. అదేవిధంగా 2015లోనే కృష్ణా జలాల్లో 299 టీఎంసీల తాత్కాలిక పంపిణీకి గత బీఆర్ఎస్ సర్కార్ అంగీకరించిందని తెలిపారు.
అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్‌ను జూరాల నుంచి శ్రీ శైలానికి మార్చడం వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.30 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెరిగిందని, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి పెండింగ్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.ఇక 2020లో ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం జీవో 203 జారీ చేసినప్పుడు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని, 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయించిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు.
