దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి(Gold, silver price) ధరలు మంగళవారం మరోసారి భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకం విలువతో పాటు కొనుగోళ్ల డిమాండ్ పెరగడంతో పసిడి, వెండి రేట్లు వరుసగా రెండో రోజు పైకి ఎగబాకినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. క్యాప్స్ గోల్డ్ (Caps Gold) వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం రూ. 1,28,541గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర, మంగళవారం నాటికి రూ.1,709 పెరిగి రూ.1,30,250 మార్కును తాకింది.
ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold) ధర రూ.1,16,000 వద్ద నమోదైంది. ముంబై, బెంగళూరు సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,651.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం బాటలోనే వెండి(Silver) ధరలు సైతం మంగళవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం కిలో వెండి ధర రూ.1,55,744గా ఉండగా, తాజాగా రూ.2,792 పెరిగి రూ.1,58,536కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ సిల్వర్ ధర 42.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్ అధికంగా ఉండటమే వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
22 క్యారెట్ల బంగారం ధర సాధారణంగా 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం ధరలో సుమారు 92 శాతం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ వ్యాపారి 24 క్యారెట్ల ధరలోనే జీఎస్టీని కలిపి చెబితే తుది బిల్లులో మళ్లీ జీఎస్టీ వసూలు చేయకూడదు; జీఎస్టీ లేని ధరను పేర్కొంటే బిల్లు చేసే సమయంలో అదనంగా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
