ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదలు ఇండియాకు వచ్చాక జరిగిన పరిణామాలు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని కోల్పోవడం, కేంద్రంలో రెండు మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి 'బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)లో రాసుకొచ్చారు. అయితే, ఈ పుస్తకం తమ మనో భావాలు దెబ్బతీసిందని కొందరు వ్యతిరేకించారు.అందులో వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్) మనవడు సత్యకి సావర్కర్ ఒకరు.
సోనియాగాంధీకి లీగల్ నోటీసు..
వీర్ సావర్కర్ చరిత్రను సోనియా గాంధీని తన జ్ఞాపకాల పుస్తకంలో వక్రీకరించారని పేర్కొంటూ ఆమెకు సావర్కర్ కుటుంబసభ్యులు లీగల్ నోటీసు పంపించారు. సావర్కర్ మనవడు తన న్యాయవాది సంగ్రామ్ కోల్హట్కర్ ద్వారా ఈ నోటీసును జారీ చేశారు.నవంబర్ 10న ‘హార్పర్‌కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా’ ద్వారా ప్రచురితమైన ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలోని 201, 443 పేజీలలో సావర్కర్ గురించి చేసిన ప్రస్తావనలపై సత్యకి సావర్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ పేజీల్లో ఏముంది?
కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారి దాడులు, జైలు శిక్షలను ఎదుర్కొంటున్న సమయంలో వీర్ సావర్కర్ వలస పాలకులకు క్షమాభిక్ష పిటిషన్లు రాశారని, బ్రిటిష్ అధికారులకు ఇన్ఫార్మర్లుగా సహకరించారని సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు. అండమాన్ సెల్యులార్ జైలులో సావర్కర్ అనుభవించిన కఠిన కారాగార శిక్ష, ఆనాటి చారిత్రక పరిస్థితులను విస్మరించి ఇలా రాయడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ సత్యకి సావర్కర్ సోనియాకు లీగల్ నోటీసు పంపారు.
సావర్కర్ రాజకీయ, సైద్ధాంతిక దృక్పథాన్ని వక్రీకరిస్తూ హిందువుల ఆధిపత్యం ఉండే భారత్‌ను ఆయన కోరుకున్నట్లుగా పేజీ నంబర్ 443 చిత్రీకరించడాన్ని ఆయన కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. ఈ విషయంలో సోనియా గాంధీ 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బహిరంగ వివరణ ఇవ్వాలని నోటీసులో డిమాండ్ చేశారు. అలాగే తదుపరి ముద్రణలు, డిజిటల్ వెర్షన్ల నుండి ఆ వివాదాస్పద భాగాలను తొలగించాలని కోరారు. గడువులోగా స్పందించకపోతే పుణె జిల్లా కోర్టులో పరువు నష్టం దావాతో సహా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సత్యకి సావర్కర్ హెచ్చరించారు. ఇదిలాఉండగా, సోనియాగాంధీ పుస్తకంలోని వ్యాఖ్యలపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని, వివాదాస్పద భాగాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
