క్రైమ్

Harrasment : విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు.. లెక్చరర్‌ను చితకబాదిన స్టూడెంట్స్

కొందరు గురువులు తమ బాధ్యతలను విస్మరించి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తూ సమాజంలో వారి హోదాకు ఉన్న గౌరవ మర్యాదలకు కళంకం తెస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు మంచి చెడు చెప్పే బాధ్యత గురువుపై ఉంటుంది.

కొందరు గురువులు తమ బాధ్యతలను విస్మరించి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తూ సమాజంలో వారి హోదాకు ఉన్న గౌరవ మర్యాదలకు కళంకం తెస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు మంచి చెడు చెప్పే బాధ్యత గురువుపై ఉంటుంది. పేరెంట్స్ పిల్లలకు జన్మనిస్తే గురువులు వారిని సన్మార్గంలో నడిపిస్తారు. అందుకే ‘మాతృదేవో భవ, పిత్రుదేవోభవ, ఆచార్య దేవో భవ’ అని పాఠశాలల్లో విద్యార్థులకు నేర్పిస్తుంటారు. విద్యార్థులు తప్పు చేస్తే ఇది తప్పని చెప్పాల్సిన వారే తప్పుడు దారిలో నడుస్తుండటం, పేరెంట్స్ స్థానంలో ఉండాల్సిన వారు బాలికలతో అనుచితంగా ప్రవర్తించడం ఆ వృత్తికే చెడ్డ పేరు తెస్తున్నది.

విద్యార్థినికి అసభ్య మెసెజెస్‌..

తాజాగా ఓ లెక్చరర్ విద్యార్థినికి అసభ్యకర మెసేజెస్ చేయడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్‌గూడలో ఉన్న ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు ఓ లెక్చరర్‌ను చితకబాదారు. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి ఇంగ్లీష్ లెక్చరర్ రవి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ రోజూ చాటింగ్ చేయాలని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లింది. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్స్ చూసిన వారంతా ఆగ్రహించారు. కాలేజీలోనే లెక్చరర్ రవిని పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆగ్రహంతో ఉన్న విద్యార్థులను అదుపు చేశారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా లెక్చరర్ రవిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సమాచారం. అనంతరం అతన్ని పీఎస్ తరలించినట్టు తెలిసింది. కాగా, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన రవి మీద కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అతని మీద కాలేజ్ యాజమాన్యం సైతం చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం.

తర్వాత చదవండి