జాతీయం

నదులనూ మింగేస్తున్న ఎల్‌నినో.. భూగర్భ జలాల ప్రవాహానికి బ్రేక్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి..?

వర్షాలు లేకపోయినా నదుల్లో నీరు పారుతుందంటే దానికి కారణం భూమి లోపల జరిగే సహజ జలప్రవాహాలే. కానీ ఇప్పుడు ఆ అదృశ్య నీటి ప్రవాహాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర వంటి ప్రధాన నదుల నుంచి దక్షిణ భారత నదుల వరకు ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

18 నదీ పరీవాహక ప్రాంతాల్లో 60 ఏళ్ల గణాంకాల విశ్లేషణ

గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణా సహా పలు నదుల్లో తగ్గిన భూగర్భ జలాల ప్రవాహం

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 10 నుంచి 25 శాతం వరకు క్షీణత

పెన్నార్‌ పరిధిలోని కొన్ని పరిశీలనా కేంద్రాల్లో 30 శాతానికి పైగా తగ్గుదల

భూగర్భ జలాల అధిక వినియోగంతో వేసవిలో ఉపనదులు ఎండిపోయే ప్రమాదం

వర్షాలు లేకపోయినా నదుల్లో నీరు పారుతుందంటే దానికి కారణం భూమి లోపల జరిగే సహజ జలప్రవాహాలే. కానీ ఇప్పుడు ఆ అదృశ్య నీటి ప్రవాహాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర వంటి ప్రధాన నదుల నుంచి దక్షిణ భారత నదుల వరకు ఈ మార్పులు కనిపిస్తున్నాయి. కృష్ణా, పెన్నార్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ భూగర్భ జలాల ప్రవాహం తగ్గినట్లు తాజా పరిశోధన వెల్లడించింది. మరి ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపనుంది? వేసవిలో నదులు, ఉపనదుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? దీనంతటికీ ఎల్‌నినో.. కారణమా..?

వర్షాలు లేకున్నా నదుల్లో నీరు ఎలా వస్తుంది?

వర్షాకాలం ముగిసింది. చెరువులు, కుంటలు క్రమంగా ఎండిపోతున్నాయి. ఈ సారి ఎల్‌నినో.. ప్రభావంతో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూమిపై నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. అయినా కొన్ని నదుల్లో మాత్రం నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అసలు.. వేసవిలోనూ నదులు పూర్తిగా ఎండిపోకుండా ఉండటానికి కారణం ఏమిటి? దీనివెనుక భూమి లోపల నిరంతరం జరిగే ఒక సహజ ప్రక్రియ ఉంది. అదే భూగర్భ జలాల ప్రవాహం.

వర్షం కురిసినప్పుడు కొంత నీరు నదులు, చెరువుల్లోకి చేరుతుంది. మరికొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా నిల్వ ఉంటుంది. దీనినే మనం గ్రౌండ్ వాటర్ అని చెప్పుకుంటుంటాం. ఈ నీరు భూమి పొరల మధ్య నుంచి నెమ్మదిగా ప్రయాణిస్తూ నదులు, వాగులు, వంకల్లోకి చేరుతుంది. ఇలా భూగర్భ జలాల నుంచి నదులకు చేరే నీటిని శాస్త్రీయంగా 'బేస్‌ఫ్లో' (Baseflow) అంటారు.

నదులకు ఇది ఒక రకమైన జీవనాధారం. ముఖ్యంగా వర్షాలు లేని సమయంలోనూ నదుల్లో నీటి ప్రవాహం కొనసాగడానికి బేస్‌ఫ్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సహజ నీటి సరఫరా వ్యవస్థే బలహీనపడుతున్నట్లు తాజా పరిశోధన వెల్లడించింది.

6 దశాబ్దాల పరిశోధనలో వెలుగుచూసిన నిజాలు

భారతదేశంలోని 18 నదీ పరీవాహక ప్రాంతాల్లో 1961 నుంచి 2021 వరకు భూగర్భ జలాల నుంచి నదులకు చేరే నీటి ప్రవాహంలో వచ్చిన మార్పులను గుజరాత్‌లోని ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు విశ్లేషించారు. గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణా, మహానది, మాహి, నర్మదా, కావేరి, పెన్నార్‌ సహా పలు నదులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. గ్రౌండ్ వాటర్ నుంచి నదుల్లోకి చేరే నీటిని నేరుగా కొలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నదుల్లో నమోదయ్యే మొత్తం నీటి ప్రవాహంలో వర్షాల ద్వారా చేరే నీరు, భూగర్భ జలాల నుంచి వచ్చే నీరు రెండూ కలిసే ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు మెషీన్ లెర్నింగ్ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ సిస్టమ్ తో 6 దశాబ్దాల గణాంకాలను విశ్లేషించగా పలు నదుల్లో బేస్‌ఫ్లో గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ప్రస్తుత ఎల్‌నినో.. వల్లే ఈ సమస్యలు రాలేదు. కానీ.. అది కూడా ఎంతో కొంత దోహదం చేసింది.

ఏ నదుల పరిస్థితి ఎలా ఉంది..?

వీరు చెబుతున్న లెక్కల ప్రకారం.. బ్రహ్మపుత్ర, గంగా, కృష్ణా, మహానది, మాహి, నర్మదా నదుల పరిధిలోని పరిశీలనా కేంద్రాల్లో బేస్‌ఫ్లో 10 నుంచి 25 శాతం వరకు తగ్గింది. కావేరి, పెన్నార్‌ వంటి దక్షిణ భారత నదుల పరిధిలోని కొన్ని పరిశీలనా కేంద్రాల్లో 30 శాతానికి పైగా క్షీణత నమోదైంది. బ్రాహ్మణి, కావేరి, సుబర్ణరేఖ నదుల పరిధిలోని కొన్ని కేంద్రాల్లో సుమారు 10 శాతం పెరుగుదల కనిపించింది. సింధు నది పరిధిలోని పరిశీలనా కేంద్రాల్లో దాదాపు 40 శాతం పెరుగుదల నమోదైంది. అంటే దేశంలోని అన్ని నదుల్లోనూ ఒకే విధమైన పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల ప్రవాహం తగ్గుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయినప్పటికీ పలు ప్రధాన నదుల్లో నమోదవుతున్న క్షీణత ఆందోళన కలిగిస్తోంది.

కృష్ణా, పెన్నార్‌ నదులపై ప్రభావం.. ఏపీ, తెలంగాణకు డేంజర్ సిగ్నల్

ఈ పరిశోధనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా, పెన్నార్‌ నదుల పరిధిలో భూగర్భ జలాల ప్రవాహం తగ్గినట్లు వెల్లడైంది. కృష్ణా నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన జలవనరు. సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి వంటి అవసరాలకు ఈ నదిపై రెండు రాష్ట్రాలు ఆధారపడుతున్నాయి. కృష్ణా నదికి నీటిని అందించే సహజ భూగర్భ జల ప్రవాహం బలహీనపడితే, దీర్ఘకాలంలో నదీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

మరోవైపు పెన్నార్‌ నది ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతానికి కీలకమైన జలవనరు. ఇప్పటికే తక్కువ వర్షపాతం, తరచూ కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొనే ఈ ప్రాంతంలో భూగర్భ జలాల ప్రాధాన్యం మరింత ఎక్కువ. పెన్నార్‌ పరిధిలోని కొన్ని పరిశీలనా కేంద్రాల్లో 30 శాతానికి పైగా బేస్‌ఫ్లో తగ్గినట్లు గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణలోనూ కృష్ణా నదితో పాటు దాని ఉపనదులు, వాగులు, వంకలు అనేక ప్రాంతాల నీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూగర్భ జలాల నిల్వలు తగ్గి, నదులకు చేరే సహజ నీటి ప్రవాహం బలహీనపడితే వేసవిలో చిన్న జలవనరులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ పరిశోధన రాష్ట్రాల వారీగా ప్రతి నది, ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రభావాన్ని వెల్లడించలేదు. కృష్ణా, పెన్నార్‌ పరిధిలోని పరిశీలనా కేంద్రాల్లో కనిపించిన మార్పులు ఏపీ, తెలంగాణకు సంబంధించిన నీటి భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని మాత్రం సూచిస్తున్నాయి.

భూగర్భ జలాలు ఎందుకు తగ్గిపోతున్నాయి?

భూగర్భ జలాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణాల్లో వ్యవసాయ అవసరాల కోసం బోర్లు, బావుల ద్వారా పెద్ద మొత్తంలో నీటిని తోడటం ఒకటి. ముఖ్యంగా వాయవ్య భారతదేశంలోని పొడి ప్రాంతాల్లో వరి, గోధుమ పంటల సాగు కోసం రైతులు విస్తృతంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. భూగర్భ జలాలను అవసరానికి మించి తోడటం వల్ల భూమిలో సహజంగా నిల్వ ఉండాల్సిన నీటి మట్టాలు పడిపోతున్నాయి. దీంతో గ్రౌండ్ వాటర్ నదుల్లోకి చేరే సహజ ప్రవాహం కూడా బలహీనపడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ వ్యవసాయ అవసరాలకు బోర్లపై ఆధారపడే ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా వర్షాలు సరిగా కురవని ప్రాంతాల్లో భూగర్భ జలాలే రైతులకు ప్రధాన ఆధారం. నీటి వినియోగం పెరుగుతున్న కొద్దీ భూగర్భ జలాలపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. దీనికి వాతావరణ మార్పులు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు కూడా తోడవుతున్నాయి. పరిశోధకులు గుర్తించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎల్‌నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో బేస్‌ఫ్లో సాధారణంగా తక్కువగా నమోదవుతోంది.

దేశంలో ఏటా 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాల వినియోగం

భారతదేశంలో భూగర్భ జలాల వినియోగం ఏ స్థాయిలో ఉందో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో దేశవ్యాప్తంగా సుమారు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలను వెలికితీశారు. అంటే దేశంలో ఏటా వెలికితీయడానికి అందుబాటులో ఉన్న భూగర్భ జల వనరుల్లో దాదాపు 61 శాతం వినియోగించినట్లు కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించింది.

ఈ వినియోగంలో వ్యవసాయ రంగానిదే సింహభాగం. వ్యవసాయ అవసరాలకు వినియోగించిన భూగర్భ జలాలు: 87 శాతం, గృహ అవసరాలకు వినియోగించిన భూగర్భ జలాలు: 11 శాతం. ఈ లెక్కలు.. భూగర్భ జలాలపై దేశం ఎంతగా ఆధారపడిందో తెలియజేస్తున్నాయి. ఒకవైపు సాగునీటి అవసరాలు పెరుగుతుంటే, మరోవైపు భూగర్భ జలాల సహజ నిల్వలు, నదులకు అందే నీటి ప్రవాహం తగ్గడం దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంది.

మరి.. వేసవిలో పరిస్థితేంటి?

భూగర్భ జలాల నుంచి నదులకు అందే నీరు తగ్గితే మొదటగా ప్రభావితమయ్యే అవకాశం చిన్న ఉపనదులు, వాగులు, వంకలపైనే ఉంటుంది. పెద్ద నదులతో పోలిస్తే వీటికి నీటి వనరులు పరిమితంగా ఉంటాయి. వర్షాకాలంలో నీటితో కళకళలాడే ఇలాంటి ఉపనదులు వేసవిలో క్రమంగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం కేవలం నీటి ప్రవాహానికే పరిమితం కాదు. నీటి లభ్యత తగ్గడం వల్ల నదులపై ఆధారపడే వ్యవసాయం, తాగునీటి సరఫరా కూడా ఒత్తిడికి గురికావచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలు వంటి నీటి లభ్యతపై ఇప్పటికే ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఉంది. అయితే ఈ పరిశోధన భవిష్యత్తులో ఏ ప్రాంతంలో ఎంత మేర నీటి కొరత ఏర్పడుతుందో అంచనా వేయలేదు. కానీ సహజ నీటి ప్రవాహాలు బలహీనపడటం మాత్రం ఒక హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది.

భూగర్భ జలాల సంరక్షణపై దృష్టి పెట్టాల్సిందే...

భూగర్భ జలాలు కేవలం బోర్లు, బావుల్లో కనిపించే నీటి నిల్వలు మాత్రమే కావు. నదులు నిరంతరం ప్రవహించడానికి, పర్యావరణ వ్యవస్థలు సమతుల్యంగా కొనసాగడానికి అవి కీలకమైన ఆధారం. అందుకే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం, చెరువులు, కుంటలను సంరక్షించడం, భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడం అత్యవసరంగా మారింది.

ముఖ్యంగా వ్యవసాయంలో నీటి పొదుపు పద్ధతులను ప్రోత్సహించడం, అవసరానికి మించి భూగర్భ జలాలను తోడకుండా చూడటం, వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టడం కీలకం. ఏపీ, తెలంగాణ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఈ చర్యలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీటి సంక్షోభం అంటే కేవలం తాగడానికి నీరు దొరకకపోవడం మాత్రమే కాదు. నదుల ప్రవాహం తగ్గడం, పంటల సాగు దెబ్బతినడం, జలచరాల మనుగడ ప్రశ్నార్థకం కావడం కూడా అందులో భాగమే.

ఇప్పటివరకు నదులను కాపాడుకోవాలంటే వాటిలో నీరు ఉండాలని భావించాం. కానీ తాజా పరిశోధన మరో కీలక విషయాన్ని గుర్తుచేస్తోంది. నదుల్లో నీరు పారాలంటే భూమి లోపల కూడా నీరు ఉండాలి. ఆ సహజ నీటి ప్రవాహాలనే కోల్పోతే రాబోయే రోజుల్లో నదుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్న. ఒక్క ఏడాది సరిగా వానలు కురవకపోతేనే ఇంతలా అల్లాడుతున్నాం. మరి రానున్న రోజుల్లో గ్రౌండ్ వాటర్ ఇంకా దెబ్బతింటే.. పరిస్థితేంటి..? ఇది ప్రభుత్వాలకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ నేచర్ విసురుతున్న సవాల్.

తర్వాత చదవండి