తెలంగాణ

Farmer Death : సర్కార్ నిర్లక్ష్యం.. ధాన్యం కుప్ప మీదే రైతన్న మరణం

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకు ఎల్ నినో పేరు చెప్పి అన్నదాతలకు సాగు నీరివ్వని ప్రభుత్వం.. పంట కోతలు అయ్యాక ధాన్యం కొనుగోళ్ల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకు ఎల్ నినో పేరు చెప్పి అన్నదాతలకు సాగు నీరివ్వని ప్రభుత్వం.. పంట కోతలు అయ్యాక ధాన్యం కొనుగోళ్ల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా చోట్ల ధాన్యం కల్లాల్లోకి చేరింది. కానీ, ప్రభుత్వం కంటే ముందే దళారులు, మధ్యవర్తులు అన్నదాతలతో బేరం ఆడి ధాన్యాన్ని కొనుక్కుని పోతున్నట్టు పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి.

అనంతరం వాటిని మిల్లింగ్ ఆడించి పొరుగురాష్ట్రాలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. మరికొందరు మార్కెట్లోకి రాకుండా బ్లాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే అధిక ధరకు సర్కారు లేదా బహిరంగ మార్కెట్లో బ్లాక్ చేసిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొందరు వ్యాపారులు, దళారులు కుమ్మక్కైనట్టు సమాచారం.అయినప్పటికీ రేవంత్ సర్కారులో మాత్రం ఏమాత్రం చలనం రావడం లేదు.

ఇదిలాఉండగా, ఎల్ నినో ప్రభావం కారణంగా పంటలు పండక అప్పులపాలై ఇటీవల కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినప్పటికీ అన్నదాతల విషయంలో సర్కారు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తాజాగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆలస్యం కారణంగా తాను పండించిన ధాన్యం కుప్ప మీదే అన్నదాత తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకివెళితే.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమల్ల గ్రామంలో నాళ్లం వీరస్వామి (60) అనే రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి, సర్కారు కొనుగోలు చేస్తుందని 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు.రాత్రి వర్షం పడేలా ఉందని ఆరబోసిన ధాన్యాన్ని కుప్పగా పోస్తూ, ఛాతీలో నొప్పిగా ఉందని ధాన్యం కుప్పపైనే కుప్పకూలి కన్నుమూశాడు. ప్రభుత్వ నిర్లక్ష్యమే వీరస్వామి మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాధిత రైతన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రైతు బీమా అందించాలని తోటి రైతాంగం డిమాండ్ చేస్తోంది.

తర్వాత చదవండి