Harish Rao: సిద్ధిపేటలో గెలిచే కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎవరో రావడం ఎందుకు, గెలిస్తే మంత్రి పదవి ఇవ్వడం ఎందుకు? నువ్వే రా.. నేను బీఆర్ఎస్ నుంచి, నువ్వు కాంగ్రెస్ నుంచి సిద్ధిపేటలో పోటీ చేద్దాం.. ఇక చూసుకుందాం. నువ్వో, నేనో తేల్చుకుందాం రా.. అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీశ్ రావు. సిద్ధిపేటలో గెలుస్తా, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నావుగా.. సీదాగా నువ్వు, నేనే చూసుకుందాం.. రా.. అని హరీశ్ రావు చెలరేగిపోయారు.
బీజేపీని నిలదీసే ధైర్యం ఎందుకు లేదు?
సిద్ధిపేటకు (Siddipet) వచ్చి రేవంత్ రెడ్డి తమపై విషం కక్కారని హరీశ్ రావు మండిపడ్డారు. మేము ఏందో ప్రజలకు తెలుసు అని చెప్పారు. రాష్ట్రానికి కరువు బృందాలు ఎందుకు పంపరు అని బీజేపీని నిలదీసే ధైర్యం నీకు ఎందుకు లేదు? అని రేవంత్ ను ప్రశ్నించారు హరీశ్ రావు. సిరిసిల్ల పోయినా, సిద్ధిపేట పోయినా బీజేపీని ఒక్క మాట అయినా అడిగావా? ఎందుకు ప్రశ్నించడం లేదు? నువ్వు ఎందుకు భయపడుతున్నావో ప్రజలకు అర్థమైపోయింది. నీ సంగతి మొత్తం ప్రజలకు అర్థమైపోయింది అని హరీశ్ రావు అన్నారు.
రైతులను ఆదుకోండి
నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే పడేందుకు మేము సిద్ధంగా లేము, కచ్చితంగా అంతే ఘాటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. సంస్కారం, సభ్యతతో మాట్లాడితే కచ్చితంగా మేము కూడా అంతే సభ్యతతో, అంతే సంస్కారంతో మాట్లాడతామన్నారు. కానీ నువ్వు సభ్యత మరిచినప్పుడు, సంస్కారం వీడినప్పుడు కచ్చితంగా అదే పద్ధతిలో మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం కరువు కోరలో చిక్కి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఎలా కాపాడాలి అనేదానిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ కు సూచించారు హరీశ్ రావు.
బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది
కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కరువు సాయం ప్రకటించాయని, డబ్బు విడుదల చేశాయని హరీశ్ రావు తెలిపారు. మరి సీఎం రేవంత్ మన రైతులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని నిలదీశారు. సీఎం రేవంత్ (Cm Revanth Reddy) ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. నువ్వు ఎంత తిట్టినా, ఎంత అరిచినా నిన్ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. మా లక్ష్యం ప్రజలు, మా లక్ష్యం తెలంగాణ హక్కులు కాపాడటం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం, తెలంగాణ జల హక్కులను కాపాడటమే. ప్రజలు, రైతుల పక్షాన, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం బీఆర్ఎస్ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
