తెలంగాణ

Telangana Politics: కాంగ్రెస్‌ను కొట్టేందుకు కారు, కమలం కొత్త స్కెచ్? పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాల కొత్త ప్లాన్ నిజమేనా!

Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, అంతకంటే ముందే జరగనున్న స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, అంతకంటే ముందే జరగనున్న స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న సురభి వాణిదేవి, తీన్మార్ మల్లన్న స్థానాలకు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి అవగాహన కుదిరిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీట్ల సర్దుబాటుపై రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ ఇదే..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పట్టభద్రులను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాల్లో పరస్పరం సహకరించుకునేలా ఆ రెండు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఓటమి పాలైన ఆయన, అంతకుముందు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ స్థానంలో బీఆర్ఎస్ తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేసేలా అనామక అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉందని, ఇందుకోసం కాసాని వీరేష్, నాగేందర్ గౌడ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం నుంచి 2024 ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాకేష్ రెడ్డిని మళ్లీ బరిలో దింపితే సానుభూతి కలిసి వస్తుందని గులాబీ దళం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం హామీతో ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారని సమాచారం. ఇక్కడ బీజేపీ బలహీన అభ్యర్థిని నిలబెట్టి, తమ ఓట్లు కారు గుర్తుకు పడేలా సహకరించే ప్రణాళిక ఉందనే ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన ఈ రెండు పార్టీలు, ఈసారి అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం చేయడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు బరిలో నిలవడం ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన బదిలీల్లో ప్రాధాన్యత లేని పోస్టు ఇవ్వడంతో ఆయన జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ముందస్తు ప్రచారం.. విమర్శలు, ప్రతివిమర్శలు

ప్రతిపక్షాల వ్యూహాలకు భిన్నంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం నుంచి రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఇటీవల కూడా 'కారులో వెళ్లి కమలంలో కలుస్తున్నారంటూ' సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల ఇదే అంశాన్ని సామ రామ్మోహన్ రెడ్డి ప్రస్తావించారు కూడా. హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ మాజీ సీనియర్ మంత్రి బీజేపీ పెద్దలతో మంతనాలు సాగితున్నారని ఆయన విమర్శలు కూడా గుప్పించారు.

మరోవైపు బయటకు పరస్పరం విమర్శలు చేసుకుంటూ, లోపల మాత్రం సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నారనే ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉందో బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థుల అధికారిక ప్రకటన తర్వాత స్పష్టత రానుంది. ఏదేమైనా, విద్యావంతులైన పట్టభద్రులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది రాబోయే ఎన్నికల్లో ఆసక్తికరంగా మారనుంది.

తర్వాత చదవండి