తెలంగాణ

Prashanth reddy: రేవంత్ రెడ్డి మానసిక స్థితి బాగానే ఉందా?: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం, ఆ మరుసటి రోజే సిద్దిపేటలోనూ అదే తరహా మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం, ఆ మరుసటి రోజే సిద్దిపేటలోనూ అదే తరహా మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎవరు గెలుస్తారో, అసలు ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని స్థితిలో ఇలాంటి హామీలు ఇవ్వడం అర్థరహితమని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలోనే మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్న విషయాన్ని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. ముందుగా ఆ ఖాళీ పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఉన్న మంత్రి పదవులనే నింపలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఏ ఒక్కరికి మంత్రి పదవి కట్టబెట్టినా మిగతా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఎటువైపు వెళ్తారోననే భయంతోనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆరోపించారు. సొంత కేబినెట్‌లో ఖాళీలను పూడ్చలేని వ్యక్తి, రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై మంత్రి పదవుల హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ అమరవీరుడు శ్రీకాంత చారి తల్లిని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. గతంలో శ్రీకాంత చారి తల్లిని అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆమెను ఓడించిందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. ఉద్యమకారులపై కాంగ్రెస్ నాయకులకు నిజంగానే అంతటి గౌరవం, ఆప్యాయత ఉంటే ఆనాడే ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉండాల్సిందని చురకలంటించారు.

ఉద్యమ త్యాగాలను, అమరవీరుల కుటుంబాల మనోభావాలను రాజకీయ స్వార్థానికి వాడుకోవడం నీచ రాజకీయాలకు నిదర్శనమని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవాలను దాచిపెట్టి ఇచ్చే ఇలాంటి అసంబద్ధ హామీలను నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. పరిపాలనపై దృష్టి సారించి, ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు.

తర్వాత చదవండి