Hero Nikhil: దేశ వ్యాప్తంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇప్పుడున్న యువతలో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ‘నషాముక్త్ భారత్’ పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ పాల్గొన్నారు. ఇక.. ఈ సందర్భంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, సినిమాల్లో డ్రగ్స్, సిగరెట్, మద్యం లాంటి వాటిని హీరోయిజంగా చూపించే విషయంలో నిఖిల్ తన అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు.
యువతకు నిఖిల్ కీలక సందేశం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘నషాముక్త్ భారత్’ అవగాహన పాదయాత్రలో భాగంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ: యువత డ్రగ్స్, మద్యం, సిగరెట్ లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. సినిమా హీరోలను యువత ఎంతో ప్రభావితంగా చూస్తుందని, అందుకనే సినిమాల్లో కూడా ఇలాంటి అలవాట్లను ప్రోత్సహించే సీన్స్ తగ్గించాల్సిన అవసరం ఎంతోనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
భాష ఏదైనా..సినిమాల్లో చెడు అలవాట్లను హీరోయిజంగా చూపించకుండా, సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా సినిమాలు తెరకెక్కించాలని నిఖిల్ కోరారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చిందని నిఖిల్ చెప్పడం యువతకి గొప్ప సందేశాన్ని ఇచ్చినట్టుగా అనిపించింది. అంతేకాదు, ఈ కార్యక్రమంలో నిఖిల్ తన వ్యక్తిగత అనుభవాలను కూడా ఈ సందర్భంగా తెలిపారు. కాలేజీ రోజుల్లో తన స్నేహితుల్లో కొందరు డ్రగ్స్ తీసుకోవాలని, మందు తాగాలని ఎంకరేజ్ చేశారట. తాను మాత్రం ఆ అలవాట్లకు దూరంగా ఉన్నానని చెప్పారు. అప్పట్లో, తాను కూడా ఆ ప్రలోభాలకు లొంగి ఉంటే, తన సినీ ప్రయాణం మరోలా ఉండేదని, 21 సినిమాలు చేసేవాడిని కాదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు 21 సినిమాల్లో నటించినప్పటికీ, నిఖిల్ తన సినిమాల్లో డ్రగ్స్ తీసుకునే పాత్రలను ఒప్పుకోల్దని తెలిపారు. ఇకపై కూడా అలాంటి పాత్రలు చేయకూడదనే నిర్ణయంతో ఉన్నట్టుగా చెప్పాడు. తన కెరీర్లో క్రమశిక్షణ, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం లాంటివి ప్రధానమైన పాత్ర పోషించాయని నిఖిల్ చెప్పుకొచ్చారు. కాగా, నిఖిల్ నటించిన స్వయంభు సినిమా విడుదలకి సిద్ధమవుతోంది.
