జాతీయం

INDIA Bloc Meeting: కీలక బిల్లుకు మెజారిటీ దిశగా ఎన్డీఏ కసరత్తు.. ఆ రెండు పార్టీల వైఖరిపైనే అందరి చూపు!

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ సాధించే దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తోంది. ఈ పరిణామాల్లో లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి అత్యంత కీలకంగా మారింది.

  • నేడు చెన్నైలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ

  • 2051 వరకు సీట్ల ఫ్రీజ్, 50శాతం పెంపుతో స్టాలిన్ డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • డీఎంకే మద్దతుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) మద్దతుతో బిల్లు గట్టెక్కే అవకాశం

  • చీలికలు, క్రాస్ ఓటింగ్ భయంతో 'ఇండియా' కూటమిలో కలవరం

  నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill 2026), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ సాధించే దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తోంది. ఈ పరిణామాల్లో లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి అత్యంత కీలకంగా మారింది.

 నేడు చెన్నైలో జరగనున్న డీఎంకే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బిల్లులకు మద్దతు ఇచ్చే దిశగా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని, అలాగే రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని ఎలాంటి మార్పులు లేకుండా మరో 25 ఏళ్ల పాటు (2051 వరకు) కొనసాగించాలని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ డిమాండ్ చేశారు.

 కేంద్రం తీసుకొస్తున్న నూతన 132వ రాజ్యాంగ సవరణ బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెంపుతో పాటు 2051 వరకు పునర్విభజన ఫ్రీజ్ నిబంధనలను పొందుపరచడంతో డీఎంకే పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లు నెరవేరినట్లయింది. మరోవైపు, డీఎంకే మద్దతుపై మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్డీఏ కీలక నేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఏం జరగబోతోందో మీరే చూస్తారుగా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 డీఎంకే (22), ఎన్సీపీ-శరద్ పవార్ (8) ఎంపీలతో పాటు ఇతర చిన్న పార్టీలకు చెందిన 10 నుంచి 12 మంది ఎంపీల మద్దతు తోడైతే బిల్లు సులభంగా గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమిలో కలవరం మొదలైంది. కూటమి పార్టీల మధ్య ఐక్యత కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, నేడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి బిల్లులకు మద్దతు ప్రకటించిన శరద్ పవార్ వర్గం గైర్హాజరయ్యే అవకాశం ఉంది.

 డీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చివరి నిమిషం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే గతంలోనే టీఎంసీ, శివసేన (ఉద్ధవ్)లలో చీలికలు కనిపించగా, ఇప్పుడు ఆర్జేడీ, జేఎంఎం ఎంపీల్లోనూ బిల్లులకు అనుకూల స్వరాలు వినిపిస్తుండటం, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశం ఉందన్న అంచనాలు ఇండియా కూటమిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తర్వాత చదవండి