తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు.. రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే షాక్!

ప్రతిపక్ష బీఆర్ఎస్‌తో రాజకీయ యుద్ధానికి సీఎం రేవంత్ సిద్ధమవుతుంటే.. సొంత పార్టీ నేతలే ఆయనకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శల దాడి పెంచుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంటిపోరు

ఒకరి తర్వాత ఒకరు.. విమర్శల వర్షం

సీఎంనే టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి రాజకీయం మొదలుపెట్టారా..?

ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారా?

అదే దారిలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రేవంత్‌కు కొరకరాని కొయ్యగా మారనున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటిపోరు మొదలైందా..? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్‌తో రాజకీయ యుద్ధానికి సీఎం రేవంత్ సిద్ధమవుతుంటే.. సొంత పార్టీ నేతలే ఆయనకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శల దాడి పెంచుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కేటాయింపులకే పరిమితమైన ఆయన విమర్శలు.. ఇకపై ప్రభుత్వ విధానాలు, విద్య, వైద్యం, భూవ్యవహారాల వరకు విస్తరించబోతున్నాయా? రేవంత్ రెడ్డి నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమవుతున్నారా? మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయినా రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడు పెంచుతుంటే, మరోవైపు అధికార కాంగ్రెస్‌లోనే అసంతృప్తి స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రభుత్వ పనితీరు, నిధుల కేటాయింపులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విమర్శలు వ్యక్తిగత అసంతృప్తిని దాటి ప్రభుత్వానికి రాజకీయ సవాల్ గా మారుతున్నాయా అన్న చర్చ మొదలైంది.

రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టార్ట్.. ఇక వెనక్కి తగ్గరా?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరోసారి కలకలం రేపాయి. పార్టీ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకే అభివృద్ధి నిధులు పరిమితమవుతున్నాయా? మిగిలిన తెలంగాణకు ప్రాధాన్యం లేదా? అంటూ ప్రశ్నించారు.

కొడంగల్‌కు రూ.20 వేల కోట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, కానీ వెనుకబడిన మునుగోడుకు కనీసం రూ.500 కోట్లయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. నియోజకవర్గానికి నిధులు అడిగినందుకు ఎమ్మెల్యేలను బెదిరించడం ఏంటని ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మునుగోడును నిర్లక్ష్యం చేస్తే మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు.

డిండి ఎత్తిపోతల పథకం, చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి, రోడ్ల నిర్మాణం వంటి పనులు నిధుల కొరతతో ముందుకు సాగడం లేదని ఆరోపించారు. తన విమర్శలకు మంత్రి పదవి దక్కకపోవడమే కారణమన్న ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి తోసిపుచ్చారు. తనకు పదవులపై ఆసక్తి లేదని, నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ముఖ్యమని తేల్చిచెప్పారు.

ఇంతటితో రాజగోపాల్ రెడ్డి ఆగుతారా..?

అయితే ఇక్కడితో రాజగోపాల్ రెడ్డి రాజకీయ పోరాటం ఆగిపోతుందా? లేక ఇకపై మరింత విస్తృతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం మునుగోడు నిధులకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని విద్య, వైద్యం, భూవ్యవహారాలు, భూ కుంభకోణాలపై కూడా ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

ప్రజలకు సంబంధించిన కీలక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటం చేస్తే.. అది రేవంత్ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సీఎం నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయనే విమర్శలను కూడా ఆయన తన రాజకీయ అస్త్రంగా మలుచుకుంటారా? అన్నది చూడాలి. అదే జరిగితే ఈ పోరాటం కేవలం ఒక ఎమ్మెల్యే అసంతృప్తిగా మిగిలిపోదు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే రాజకీయ ఒత్తిడి పెంచే పరిణామంగా మారుతుంది.

ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న కూడా ఉంది. అధికార పార్టీలో ఉంటూనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉంటుందా? లేక ముఖ్యమంత్రిని విమర్శిస్తే అది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తారా? సొంత పార్టీలో ప్రజాస్వామ్యానికి రేవంత్ ప్రభుత్వం ఎంతవరకు అవకాశం ఇస్తుంది? ఈ అంశాలపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది.

మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదా.. అసంతృప్తికి అసలు కారణం అదేనా?

రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి మంత్రి పదవి కారణం కాదని పైకి చెబుతున్నా.. అసలు విషయం అదే అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారనే వార్తలు వినిపించాయి. సీనియర్ నేతగా, గతంలో బీజేపీలో ఉండి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకుడిగా తనకు కేబినెట్‌లో అవకాశం దక్కుతుందని ఆయన భావించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మరోసారి మాట ఇచ్చారని పార్టీలో ప్రచారం ఉంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కేబినెట్‌లో అవకాశం గురించి స్పష్టత లేకపోవడంతో ఆయన గళం విప్పుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

గతంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్‌లోనే ఉంటానని, రాహుల్ గాంధీపై తన విధేయతను వదులుకోబోనని తేల్చిచెప్పారు. కొద్దిరోజుల కిందట ఆయన సైలెంట్ అయినట్లు కనిపించినా.. ఇప్పుడు మళ్లీ స్వరం పెంచడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి రాజకీయం మొదలైందా అనే చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది.

అనిరుధ్ రెడ్డిదీ అదే దారి.. ప్రభుత్వంపై మరో దాడి

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఒకవైపు కలకలం రేపుతుంటే, మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నారు. ఆయన విమర్శల్లో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు.

తన నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు సుమారు రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని కూడా హెచ్చరించారు. మంత్రుల నియోజకవర్గాలకు నిధులు వెళ్తున్నాయని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

తాజాగా మరోసారి స్వరం పెంచారు. ప్రభుత్వ అధికారుల అవినీతి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు. చిన్న చిన్న పనులు చేయించుకోవడానికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఒక అధికారిని తాను స్వయంగా కోరినా పని చేయలేదని, అదే వ్యక్తి రూ.15 వేలు ఇవ్వడంతో పని పూర్తి చేశారని ఆరోపించారు. చివరికి రూ.5 లక్షల సీసీ రోడ్డు బిల్లు కోసం కూడా మెజర్‌మెంట్ బుక్‌లో నమోదు చేసేందుకు 10 నుంచి 20 శాతం కమీషన్ అడుగుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

పార్టీలోనే రేవంత్‌కు అసలు పరీక్ష.. కాంగ్రెస్ రాజకీయాలు మారనున్నాయా?

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం 2028 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరాటం సాగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో మొదలైన ధిక్కార స్వరాలు సీఎం రేవంత్‌కు పరీక్షగా మారుతున్నాయి.

రేవంత్ రెడ్డికి ఇప్పుడు రెండు రకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకటి ప్రతిపక్షాల రాజకీయ దాడిని ఎదుర్కోవడం. రెండోది సొంత పార్టీలో అసంతృప్తిని చల్లార్చడం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు కావాలని అడుగుతున్నారు. అభివృద్ధి పనులు జరగకపోతే ప్రజల ముందు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తమకు ఎదురవుతోందని వాపోతున్నారు.

అయితే రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా కొత్త అజెండాతో ముందుకు వస్తే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది. విద్య, వైద్యం, భూవ్యవహారాల వంటి ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. ఆయన విమర్శలకు రాజకీయంగా మరింత బలం వచ్చే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి రానున్న రోజుల్లో.. రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారే అవకాశమూ లేకపోలేదు.

మరోవైపు అనిరుధ్ రెడ్డి లేవనెత్తుతున్న అవినీతి ఆరోపణలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమే. ఇద్దరు ఎమ్మెల్యేల విమర్శలను విడివిడిగా చూడాలా? లేక కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతాలుగా భావించాలా? అన్నది కీలకంగా మారింది.

ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న సమస్యలను పరిష్కరించకుండా కేవలం క్రమశిక్షణ చర్యలతో అసంతృప్తిని అణచివేయడం సాధ్యమవుతుందా? సొంత పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సహించగలరా? పార్టీలో ప్రజాస్వామ్యానికి అవకాశం ఇస్తారా? లేక ధిక్కార స్వరాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తారా?

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటివరకు తెర వెనుక సాగిన అసంతృప్తి ఇప్పుడు బహిరంగ పోరాటం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? అనిరుధ్ రెడ్డి విమర్శలు మరింత పెరుగుతాయా? ఈ ఇద్దరితోనే ఈ ధిక్కార స్వరాలు ఆగిపోతాయా? లేక మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గొంతు కలుపుతారా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ పరిణామాలు.. సీఎం రేవంత్ కు పరీక్ష పెట్టేవే. ఎలాగోలా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఆయన శాంతింపజేయాల్సిందే. లేదంటే.. పార్టీకి ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.

తర్వాత చదవండి