ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా సరే ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల తరహాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య ఎలాంటి స్థానాల పంపకాలు లేదా సర్దుబాట్లు ఉండవని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం జనసేన కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
ఇటీవల ముగిసిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగగా, కొన్ని స్థానాల్లో పంపకాలు క్లిష్టతరంగా మారాయి. ఆ సమయంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కలేదని కొందరు జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, పల్లె పోరులో పార్టీ క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో జరిగేవని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసి పోటీ చేసే హక్కు ఉంటుందని, పోటీకి సిద్ధపడే జనసేన శ్రేణులను పార్టీ నాయకులెవరూ అడ్డుకోకూడదని పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో జనసేన శ్రేణులలో కొత్త ఉత్సాహం నెలకొంది. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరగాలన్నదే తమ పార్టీ అభిమతమని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో వివరించారు. అధినేత నిర్ణయంతో గ్రామీణ స్థాయిలో బలంగా ఉన్న జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
అదే సమయంలో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేదా ఆటంకాలు ఎదురైనా తక్షణమే స్పందించేందుకు పార్టీ ప్రత్యేక 'హెల్ప్ డెస్క్'ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు అభ్యర్థులకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని కేంద్ర కార్యాలయం తెలిపింది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నట్లు వెల్లడించింది.
