స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Water War : తెలంగాణలో నీళ్ల మంటలు.. ఏపీ నీళ్ల దోపిడీకి దొంగల వ్యవస్థ సపోర్టు?

ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారి తీసింది.డెడ్ స్టోరేజ్‌లో నీరు ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

- డెడ్ స్టోరేజీ ఉన్నా నీటిని తోడేందుకు ఆంధ్రప్రదేశ్ టన్నెల్ నిర్మాణం

- హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ

- శ్రీశైలంలో పొతిరెడ్డిపాడు.. నాగార్జున సాగర్‌లో టన్నెల్

- ఉమ్మడి ఏపీ సీఎంల కంటే ఎక్కవ దోచిపెడుతున్నారు?

- 9 నెలలుగా పనులు జరుగుతుంటే కళ్లు మూసుకున్న రేవంత్ సర్కార్

- 36 పవర్ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకెళ్తున్నా లెక్కలు వేయడం లేదు?

- రైట్ బ్యాంక్ కెనాల్ ఉన్నా కొత్త టన్నెల్ ఎందుకు?

- ఆనాడు బనకచర్ల.. ఈనాడు పల్నాడు వాటర్ గ్రిడ్?

- ఏపీ అధికారిని సలహాదారుడిగా పెట్టుకుంటే ఇంతకంటే ఎక్కవ ఏం ఆశిస్తాం

- అధిత్యనాథ్ దాస్‌పై చర్యలు ఉండవా?

- దోపిడీతత్వం.. దొంగలకే పెత్తనం పార్ట్ -2

- ‘స్వేచ్ఛ న్యూస్’ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ ఛైర్మన్

9848070809

ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారి తీసింది.డెడ్ స్టోరేజ్‌లో నీరు ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌‌లో భారీ సొరంగం నిర్మించి, ఎలాంటి అనుమతులు లేకుండా, కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా 90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే కుట్ర చేస్తోంది. ఇప్పటికే శ్రీశైలానికి కన్నం వేసి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తోడుకుంటున్న ఆంధ్రా పాలకులు ఇప్పుడు ఏకంగా నాగార్జున సాగర్‌‌కే కన్నం వేస్తున్నారు. తాగునీటి పథకం పేరుతో పైప్‌‌లైన్ నిర్మించి 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది.

పేరుకు తాగునీటి పథకమైనా దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించే కుట్ర జరుగుతోంది.ముఖ్యంగా డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకోవడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.ఒకవైపు హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలు తీర్చుకోవడమే సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల హయాంలో జరిగిన నీటి తరలింపుతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఎక్కువగా నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

9 నెలలుగా పనులు.. ప్రభుత్వానికి తెలియదా?

టన్నెల్ నిర్మాణ పనులు తొమ్మిది నెలలుగా కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించ లేదు? రేవంత్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎందుకు దృష్టి సారించ లేదు. అంతేకాదు శ్రీశైలం దగ్గరలో 36 పవర్ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన నీటి లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి సీఎం రమేష్ బినామీలకు సంబంధించినవిగా ఆరోపణలు ఉండగా, క్విడ్ ప్రోకో పద్దతిలో తెలంగాణ నేతలకు డబ్బులు చేరుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రైట్ బ్యాంక్ కెనాల్ అందుబాటులో ఉండగా కొత్తగా సాగర్ దగ్గర భారీ టన్నెల్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏమిటన్నది కీలక ప్రశ్న. గతంలో బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెరపైకి రాగా, ఇప్పుడు భారీ టన్నెల్ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్మాణం వెనకున్న అసలు ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ఎంత నీటిని తరలించనున్నారు? తెలంగాణకు కలిగే నష్టం ఎంత? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

పల్నాడు వాటర్ గ్రిడ్.. అమరజీవి జలధార ప్రాజెక్ట్

ఆంధ్రాలోని కూటమి ప్రభుత్వం గుంటూరు, పల్నాడు జిల్లాలకు తాగునీటి సరఫరా పేరుతో నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ ఒడ్డున భారీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతానికి పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ అని పిలుస్తున్నా, అసలు పేరు అమరజీవి జలధారగా నిర్ణయించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.1,200 కోట్లతో నిర్మిస్తోంది. దీనిద్వారా పల్నాడు ప్రాంత గ్రామాల్లో 200కు పైగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం చేపట్టి తాగు నీటిని అందించనున్నట్టు చెబుతోంది. ఏపీ ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షణలో సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా నీటిని తరలించేలా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. సాగర్‌ డ్యామ్‌ నుంచి రైట్‌ బ్యాంక్‌ వైపు దాదాపు కిలోమీటర్‌ దూరంలోనే అనుపు రోడ్డుకు ఆనుకుని మూడెకరాలకు పైగా విస్తీర్ణంలో గ్రిడ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

సలహాదారు నియామకంపైనా అనేక ప్రశ్నలు

ఏపీకి చెందిన అధికారిని తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా నియమించుకోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ అధికారిని సలహాదారుడిగా పెట్టుకుంటే ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం అని తెలంగాణ ప్రజలు నిట్టూరుస్తున్నారు. మరి ఆదిత్యనాథ్ దాస్ పాత్ర ఏంటి? ఈ వ్యవహారంలో ఆయన బాధ్యతలపై ప్రభుత్వం వివరణ ఇస్తుందా? ఆయనపై చర్యలు తీసుకుంటారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సాగర్‌ నుంచి నీటిని తరలించే పనులను ఫిబ్రవరి నుంచి ఏపీ సర్కార్‌ బహిరంగంగా కొనసాగిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు.

సాగర్‌ సర్కిల్‌లో సీఈతోపాటు ఎస్‌ఈలు, ఈఈలు, క్షేత్రస్థాయిలోని ఏఈల వరకు చాలామంది అధికారులు విధుల్లో ఉంటారు. అయినా కూడా దీని గురించి పట్టించుకోకపోవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎస్‌ఈ ఒకరు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో దీన్ని ఉద్దేశపూర్వకంగా తేలికగా తీసుకోవడంతో ఇంతదాకా వచ్చిందనేది ఇప్పటికే స్పష్టమైంది. తెలంగాణ నీటి హక్కులు, ప్రజల తాగునీటి అవసరాలు, సాగునీటి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నీటి తరలింపుపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పడంతో పాటు, టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది. మరి ఏపీ జల దోపిడీ ఆరోపణలపై విచారణ ఎప్పుడు? తెలంగాణ నీటి ప్రయోజనాలకు రక్షణ ఎప్పుడు? అన్నదానికి రేవంత్ సర్కార్ జవాబు చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రతీ విషయంలో ఏపీ కోర్టులకు వెళ్తున్నప్పుడు తెలంగాణ తెలంగాణ మాత్రం ఎందుకు వెళ్లడం లేదనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

హైదరాబాద్ ప్రజల గొంతు ఎండుతోంది..

1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణపై కుట్రలు జరిగాయి. బచావత్ ట్రిబ్యునల్ నీటి వాటాలు తేల్చలేదు. పోతిరెడ్డిపాటు పేరుతో జల దోపిడీ జరుగుతోంది. ఇప్పుడు సాగర్ నీటి విషయంలోనూ దోపిడీ చేస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ ప్రజల గొంతు ఎండడం ఖాయం. తెలంగాణలో ఏపీ ప్రజలు చాలామంది ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కువ మంది ఉంటున్నారు. హైదరాబాద్ అనేది జాతీయ నగరం. ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు. వారికి తగ్గట్టు నీటిని సరఫరా చేయడం ప్రభుత్వం బాధ్యత. అటు శ్రీశైలం దగ్గర, ఇటు సాగర్ దగ్గర ఏపీ యథేచ్ఛగా నీటిని తోడేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది? రానున్న రోజుల్లో నగరానికి నీరు అందించలేకపోతే విమర్శలు ఖాయం.ఈ నీళ్ల మంటలను చల్లార్చకపోతే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదు.

తర్వాత చదవండి