భారత దేశానికి సమీప భవిష్యత్‌లో భారీ ముప్పు పొంచి ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రహస్యల కోసం విదేశీ శక్తులు హానీ ట్రాప్ వలలు విసురుతున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, హనీట్రాప్ కంటే సైబర్ గూఢచర్యం నుంచే మరింత ముప్పు ఉందన్నారు. హనీ ట్రాప్ విసరడం శత్రుదేశాల గూఢచర్య వ్యూహంలో చిన్న భాగం మాత్రమేనని తెలిపారు. దీనివెనుక సైబర్ వార్‌ఫేర్, ఆర్థిక మోసాలతో కూడిన పెద్ద స్పై ఆపరేషన్ ఉందని స్పష్టంచేశారు.
సోమవారం ఢిల్లీలో జరిగిన 'ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0'లో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగమే లక్ష్యంగా విదేశీ గూఢచర్య సంస్థలు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అందుకు సైన్యం, రక్షణ పరిశోధన సంస్థలు పటిష్టమైన సాంకేతిక, సంస్థాగత రక్షణ కవచాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ప్రయోగశాలలతో పాటు ప్రైవేట్ రక్షణ రంగ కాంట్రాక్టర్లను కూడా శత్రు దేశాల ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు.
ఇది కేవలం హనీట్రాప్ మాత్రమే కాదని, పూర్తిస్థాయి సైబర్ గూఢచర్యం అన్నారు.సైనికులకు వివిధ రకాల ఆశలు చూపి కీలక మైన దేశ రహస్య సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.దీనిలో మల్టీ-లెవెల్ మార్కెటింగ్ , అధిక వడ్డీ వ్యాపారుల పాత్ర కూడా ఉందన్నారు.ఈ వ్యవహారాలపై నిరంతరం నిఘా ఉంచామని, వ్యవస్థాగతంగా వీటిని అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.
దేశ సైనిక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు సాధారణ ఇంటర్నెట్‌కు దూరంగా, పూర్తిగా ఎయిర్-గ్యాప్డ్ విధానంలో సురక్షితంగా ఉంటాయన్నారు. అందుకే హార్డ్‌వేర్‌పై నేరుగా సైబర్ దాడులు అసాధ్యమన్నారు. అందుకే విదేశీ నిఘా హ్యాండ్లర్లు సాంకేతికతను కాకుండా, అక్కడ పనిచేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని వివరించారు. ప్రైవేట్ రక్షణ రంగ సంస్థలు తమ నెట్‌వర్క్‌లను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో, ఎలాంటి సాఫ్ట్‌వేర్‌లను వాడాలో సూచించేందుకు ప్రత్యేక ఏజెన్సీ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇటీవల పాక్ నుంచి హనీట్రాప్ కేసులు మరింత పెరగడంతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ అశుతోష్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


