Kollywood: థలపతి విజయ్ కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘మెర్సల్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవడమే కాకుండా, కథా నేపథ్యం, విజయ్ పోషించిన మూడు విభిన్న పాత్రలు, సామాజిక అంశాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు ఇదే తరహా కథతో సూర్య హీరోగా దర్శకుడు టీజే జ్ఞానవేల్ సినిమా చేస్తున్నారని తాజా సమాచారం.
ఇక, ఈ వార్తల్లో కొంతవరకూ వాస్తవం ఉన్నప్పటికీ, ‘మెర్సల్’ కథనే సూర్యతో రీమేక్ చేస్తున్నారనేది మాత్రం నిజం కాదట. ఇప్పటివరకు కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 5 రూపాయలకే వైద్యం అందించినటువంటి తమిళనాడుకు చెందిన డాక్టర్ తిరువేంగడం వీరరాఘవన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోందనే ప్రచారం జరుగుతోంది.
5 రూపాయల డాక్టర్‌గా సూర్య.. ‘మెర్సల్’ను గుర్తు చేస్తున్న చిత్రకథ!
విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలో 5 రూపాయలకే వైద్యం అందించే డాక్టర్ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ, వైద్య రంగంలో జరుగుతున్న మాఫియాను ఈ సినిమా బలంగా ప్రశ్నించింది. అయితే, ఇప్పుడు సూర్య కూడా ఇలాంటి నేపథ్యమున్న కథలో నటిస్తుండటంతో కామన్ గానే అందరిలోనూ ‘మెర్సల్’తో పోలికలు మొదలయ్యాయి.
రెండు కథలలో పోలికలు ఉన్నాయా?
జ్ఞానవేల్ డైరెక్షన్ లో సూర్య నటించబోతున్న సినిమాలో 5 రూపాయల డాక్టర్ జీవితాన్ని ప్రధానంగా చూపించనున్నారనే ప్రచారం ఊపందుకుంది. కేవలం 5 రూపాయలకే వైద్యం అందిస్తూ, సామాన్యులకు సేవ చేసిన ఒక వైద్యుడి ప్రయాణాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారట. ఒకరకంగా, ఇది బయోపిక్ అనే చెప్పాలి. అయితే, ఈ కథకు కమర్షియల్ అంశాలను కూడా జత చేస్తున్నట్లుగా సమాచారం.
ఇక్కడే, ‘మెర్సల్’తో పోలికలు వస్తున్నాయి. ఆ సినిమాలో కూడా విజయ్ 5 రూపాయల డాక్టర్‌గా కనిపించారు. కార్పొరేట్ వైద్య వ్యవస్థలోని లోపాలను బలంగా ప్రశ్నించారు. ఇప్పుడు, సూర్య సినిమా కూడా ఇదే తరహా అంశాలతో రూపొందించబోతుండటంతో.. ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మరి, జ్ఞానవేల్ అంతర్లీనంగా ఎలాంటి కంటెంట్‌ను జనరేట్ చేయనున్నాడో చూడాలి.


