జాతీయం

Adani Group: మరో చిక్కుల్లో అదానీ.. మహారాష్ట్ర ప్రాజెక్ట్ లెక్కల్లో ఏం జరిగింది?

5 నిమిషాల పఠనం

Adani Group: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ను మరో కొత్త వివాదం చుట్టుముట్టింది. మహారాష్ట్రలో చేపట్టబోయే ఒక భారీ విద్యుత్ ప్రాజెక్ట్ ఖర్చును ఏకంగా వంద రెట్లు తగ్గించి చూపించారన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

Adani Group: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ను మరో కొత్త వివాదం చుట్టుముట్టింది. మహారాష్ట్రలో చేపట్టబోయే ఒక భారీ విద్యుత్ ప్రాజెక్ట్ ఖర్చును ఏకంగా వంద రెట్లు తగ్గించి చూపించారన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ నిబంధనల కింద చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల సొమ్మును ఎగ్గొట్టేందుకే ఇలా లెక్కలు మార్చారన్న విమర్శలు రావడంతో, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర పర్యావరణ శాఖ విచారణకు ఆదేశించాయి.

అసలు ఈ ప్రాజెక్ట్ లెక్కల్లో ఏం జరిగింది?

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 'తారాలి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్'ను అదానీ గ్రీన్ ఎనర్జీ చేపడుతోంది. 2025 ఫిబ్రవరి 11న ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతుల లేఖలో మొత్తం వ్యయం రూ. 5,675 కోట్లు అని స్పష్టంగా రాసి ఉంది. దీని ఆధారంగానే, 2026 ఫిబ్రవరి 23న మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు అదానీ సంస్థకు 15 షరతులు విధిస్తూ అనుమతులు ఇచ్చింది. అందులో ప్రధానమైనది ప్రాజెక్ట్ ఖర్చులో 4 శాతం, అంటే రూ. 227 కోట్లను వన్యప్రాణుల సంరక్షణ కోసం 'సహ్యాద్రి టైగర్ రిజర్వ్' బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.

ఒక్క అఫిడవిట్‌తో తారుమారైన లెక్క!

అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ 8న అదానీ సంస్థ దాఖలు చేసిన ఒక నోటరైజ్డ్ అఫిడవిట్‌తో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. గతంలో 'అనలాగస్ ఎస్టిమేషన్' పద్ధతిలో అంచనా వేయడం వల్ల తప్పు జరిగిందని, వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ఖర్చు కేవలం రూ. 56.75 కోట్లు మాత్రమేనని అందులో పేర్కొంది. దీనికి అక్టోబర్ 12న మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలపడంతో, 4 శాతం లెక్కన రూ. 227 కోట్లు కట్టాల్సిన చోట కేవలం రూ. 2.27 కోట్లు జమ చేసి చేతులు దులిపేసుకుంది. అంటే ఒక్క పాయింట్ (.) మార్పుతో ఏకంగా రూ. 225 కోట్ల తేడా వచ్చేసింది.

పీఎంఓకు ఫిర్యాదు.. విచారణ షురూ!

వన్యప్రాణుల సంరక్షణకు రావాల్సిన వందల కోట్ల నిధులకు గండి పడుతోందంటూ సతారా జిల్లా ఆనరరీ వైల్డ్‌లైఫ్ వార్డెన్ రోహన్ బాటే రంగంలోకి దిగారు. ప్రాజెక్ట్ విలువను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి చూపారని ఆరోపిస్తూ ఆయన నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO), మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

నవంబర్ 5న ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోయినా వైల్డ్‌లైఫ్ శాంక్చువరీ డెప్యూటీ డైరెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. మరుసటి రోజే, అంటే నవంబర్ 6న కేంద్ర పర్యావరణ శాఖ సైతం దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అదానీ గ్రూప్ వివరణ ఏంటి?

మరోవైపు, తమపై వస్తున్న ఆరోపణలను అదానీ సంస్థ తీవ్రంగా ఖండించింది. చట్టబద్ధమైన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ప్రాజెక్ట్ ఖర్చును తగ్గించామన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేసింది. ఇప్పుడు ప్రభుత్వ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.

#Adani Group#Gautam Adani#Adani Green Energy#Maharashtra Project#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి