బాలీవుడ్ మెగాస్టార్, అమితాబ్ బచ్చన్ చేసిన ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రముఖులపై వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న తరుణంలో, అలాగే ముంబైలోని ఆయన నివాసం 'జల్సా' వెలుపల కాల్పులకు కుట్ర పన్నారనే వార్తల మధ్య అమితాబ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 15-16 మధ్య రాత్రి ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'బచ్ గయే' (బతికిపోయాం) అని మాత్రమే రాసుకొచ్చారు.
అయితే ఈ వ్యాఖ్యే సందర్భంలో, ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా' బయట కాల్పులు జరిపేందుకు కుట్ర పన్నారన్న సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన వికాస్ థాకూర్ అలియాస్ విక్కీ, దీపక్ సింగ్ అలియాస్ దీప్‌లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారిపై కాల్పులు జరిపి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేయడంతో పాటు, ముంబైలో అమితాబ్ బచ్చన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఈ నిందితులు పక్కా పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో అమితాబ్ చేసిన కొన్ని వ్యాఖ్యలే ఆయనను టార్గెట్ చేయడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని నిందితులు భావించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇదిలా ఉండగా పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. గత నెలలోనే అమితాబ్ నివాసంతో పాటు ముంబైలోని పలు ప్రముఖ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఏకంగా మూడుసార్లు నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు రావడం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై పోలీసులు 'జల్సా' నివాసం వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అరెస్టైన నిందితుల నుంచి అత్యాధునిక ఆయుధాల సరఫరా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని కీలక వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


