హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది.తన వాయిస్ శాంపిల్ ఇవ్వాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. 2026 ప్రారంభంలో నాటి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను మతపరంగా దూషించారన్న ఫిర్యాదు మేరకు వీణవంక పీఎస్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా ఆడియో ఆధారాలను ధృవీకరించేందుకు వాయిస్ శాంపిల్ ఇవ్వాలని పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే, దానిని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నేర దర్యాప్తులో భాగంగా పోలీసులు వాయిస్ శాంపిల్స్ కోరడం, సేకరించడం సహజమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.
చట్టప్రకారం కొనసాగే ప్రక్రియను తప్పుబట్టలేమని స్పష్టంచేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసుల విచారణకు సహకరించి, వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలాఉండగా, 2026 జనవరి చివరలో కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఈ వివాదం మొదలైంది. జాతరకు పరిమిత వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలపగా, కౌశిక్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సీపీపై మతపరమైన దూషణలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు.ఆగ్రహించిన కౌశిక్ రెడ్డి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.సీపీ గౌస్ ఆలం మతాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరకర దూషణలు చేయడం, అవి కాస్త వైరల్ అవ్వడంతో దిగొచ్చిన కౌశిక్ రెడ్డి బహిరంగా క్షమాపణలు చెప్పారు.


