తెలంగాణ

Harish Rao: కాంగ్రెస్ పనైపోయింది.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే- హరీశ్ రావు

Harish Rao: కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి తెలంగాణ భవన్ లో ప్రతిరోజు జరుగుతున్న చేరికలే నిదర్శనం అన్నారు హరీశ్ రావు. పార్టీ మారిన దానం నాగేందర్ ను హైకోర్టు డిస్ క్వాలిఫై చేసిందని, రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. అన్ని సర్వేల్లో తేలుతుంది రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. ఏ పార్టీలు, ఏ ఏజెన్సీ సర్వే చేసినా ఇదే రిపోర్టు వస్తుందన్నారు.

Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోందన్నారు మాజీమంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. మాజీమంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నారు

కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి తెలంగాణ భవన్ లో ప్రతిరోజు జరుగుతున్న చేరికలే నిదర్శనం అన్నారు హరీశ్ రావు. పార్టీ మారిన దానం నాగేందర్ ను హైకోర్టు డిస్ క్వాలిఫై చేసిందని, రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. అన్ని సర్వేల్లో తేలుతుంది రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. ఏ పార్టీలు, ఏ ఏజెన్సీ సర్వే చేసినా ఇదే రిపోర్టు వస్తుందన్నారు. రేవంత్ రెడ్డిని మనం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నారని హరీశ్ రావు చెప్పారు.

అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని హరీశ్ వాపోయారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ బడులను రేవంత్ రెడ్డి బలోపేతం చేస్తే.. ఆయన కూతురు హైదరాబాద్ చుట్టూ ప్రైవేట్ స్కూళ్లు ఎందుకు పెడుతున్నారో చెప్పాలని హరీశ్ రావు నిలదీశారు.

ఎర్రగడ్డలో వేయాల్సి వస్తే మొదట రేవంత్ నే వేయాలి

''మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల అవినీతికి రేవంత్ పాల్పడ్డారని చెబుతున్నారు. 20 శాతం లంచం ఇస్తేనే పని అవుతుందని ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. వాళ్ల ఎమ్మెల్యేలే తిరగబడుతుంటే రేవంత్ అసహనానికి లోనవుతున్నాడు. కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచింది, వీళ్లను తీసుకుపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలంటున్నాడు. ఇలాంటి మాటలతో రేవంత్ పిచ్చి ఎంత పీక్స్ కు పోయిందో అర్థం అవుతుంది. ఎర్రగడ్డలో వేయాల్సి వస్తే మొదలు రేవంత్ రెడ్డిని వేయాలి'' అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కేసీఆర్ పెంచితే.. రేవంత్ దెబ్బతీశారు

సిద్ధిపేటలో ఇందిరమ్మ బీమా అని పెట్టి దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు. అభివృద్ధితో కేసీఆర్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచితే.. రేవంత్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా అని నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్ అన్నారని హరీశ్ గుర్తు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అంతగా పెంచితే.. రేవంత్ ఏమో హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తీశాడని ధ్వజమెత్తారు.

కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

''కేసీఆర్ ఉండగా నీళ్లకు బాధ లేదు, కరెంట్ బాధ లేదు, హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. రేవంత్ పాలనలో రోజుకు 80వేల వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి. కేసీఆర్ గోదావరి, కృష్ణా నీళ్లను తెచ్చి నీటి సరఫరా చేశారు. కేసీఆర్ ఉచిత నల్లా ఇస్తే, ఇప్పుడు ఉత్త నల్లా అయ్యింది. సర్ చార్జీల పేరిట అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచారు రేవంత్. పీజేఆర్ ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శన ఉండే. బీఆర్ఎస్ పాలనలో బంద్ అయ్యింది. మళ్లీ కాంగ్రెస్ వచ్చింది.. నీళ్ల బిందెలు వచ్చాయి, కరెంట్ కోతలు మొదలయ్యాయి'' అని హరీశ్ రావు విమర్శించారు.

పరిశ్రమలు, ఐటీ శాఖలకు కార్యదర్శి లేరు

''రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేడు. ఐటీకి సెక్రెటరీ లేడు. నువ్వేం పరిశ్రమలను ఆకర్షిస్తవు రేవంత్ రెడ్డి. చీఫ్ సెక్రటరీకి ఇంచార్జ్ ఇచ్చారు. వారికి సమయం ఉంటుందా? దృష్టి పెట్టగలరా? మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ గురించి మాట్లాడతారా? గతేడాది తెలంగాణ రైజింగ్ పెట్టావు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? వైట్ పేపర్ విడుదల చేయి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సమస్యలే

కేసీఆర్ 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టించారు. అందులో ఈరోజు 5లక్షల సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి. నువ్వే హోం మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి ? శాంతి భద్రతలు లేవు. మున్సిపాలిటీలో చెత్త ఎత్తుత లేరు. నువ్వే మున్సిపల్ మంత్రి? హైదరాబాద్ లో ఎక్కడ చూసినా తాగు నీటి సమస్య, దోమల సమస్య. ఉన్న నగరాన్ని పట్టించుకునే చేతగాదు.. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నావు'' అంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు హరీశ్.

విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్

''ఒక్క హైదరాబాద్ లోనే 300 బస్తీ దవాఖానలు ప్రారంభించాం. టి డయాగ్నిస్టిక్ సెంటర్లు పెట్టి 147 రకాల పరీక్షలు చేశాం. ఇప్పుడు బస్తీ దవాఖానల్లో గోలీలు కూడా లేవు. బీపీ షుగర్ గోలీలు ఇవ్వని సర్కార్ ఇది. కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు బంద్ అయిన పరిస్థితి. టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్ మూడేళ్లుగా ఏమైంది. ప్రారంభించిన టిమ్స్ సనత్ నగర్ లో డాక్టర్లు లేరు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కానీ రేవంత్ బిడ్డ కార్పొరేట్ స్కూళ్లు ప్రారంభిస్తోంది. అంటే విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినట్లా?'' అని హరీశ్ రావు ప్రశ్నించారు.

తర్వాత చదవండి