తెలంగాణ

గోదావరి పరవళ్లు.. అయినా నీళ్లు ఎత్తిపోయలేరా? మేడిగడ్డ దగ్గర పరిస్థితేంటి..? రోజుకు రూ.కోటి ఖర్చంటున్న సీఎం!

మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కళ్ల ముందే గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నాయి. నీళ్లు కనిపిస్తున్నప్పుడు వాటిని ఎత్తిపోసి రైతులకు అందించవచ్చు కదా? అన్నది బీఆర్ఎస్ నేతల ప్రశ్న. కానీ ప్రభుత్వం మాత్రం సాంకేతిక కారణాలను చూపిస్తూ నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని చెబుతోంది.

మేడిగడ్డ దగ్గర గోదావరి జలాలు భారీగా ప్రవహిస్తున్నాయా?

నీటిని ఎత్తిపోసి రైతులకు అందించడం నిజంగానే సాధ్యం కాదా?

కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర ఉన్న సాంకేతిక అడ్డంకులేంటి?

నీటిని ఎత్తిపోస్తే రోజుకు రూ.కోటి వరకు విద్యుత్ ఖర్చవుతుందా?

బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో ఉన్న అంశాలేంటి?

రేవంత్ సర్కార్ చెబుతున్న సమాధానమేంటి?

మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు కళ్ల ముందే గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నాయి. మరోవైపు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నీళ్లు కనిపిస్తున్నప్పుడు వాటిని ఎత్తిపోసి రైతులకు అందించవచ్చు కదా? అన్నది బీఆర్ఎస్ నేతల ప్రశ్న. కానీ ప్రభుత్వం మాత్రం సాంకేతిక కారణాలను చూపిస్తూ నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని చెబుతోంది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరో వివాదానికి కారణమయ్యాయి. అసలు మేడిగడ్డ దగ్గర ప్రస్తుత పరిస్థితేంటి..?

కాళేశ్వరం దగ్గర ఫొటోలు దిగుతున్నవారిని ఉద్దేశించి బర్లు కాసుకునేవాళ్లంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల మధ్య అసలు విషయమేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మేడిగడ్డ దగ్గర నీళ్లు నిజంగానే ఉన్నాయా? వాటిని ఎత్తిపోసే అవకాశం లేదా? ఒకవేళ ఎత్తిపోస్తే విద్యుత్ ఖర్చు ఎంతవుతుంది? ప్రభుత్వం చెబుతున్న సాంకేతిక అడ్డంకులేంటి? చివరకు రైతులకు దక్కే ప్రయోజనమేంటి?

మేడిగడ్డ దగ్గర గోదావరి జలాలు వృథా అవుతున్నాయా?

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి రంగంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు. గోదావరి జలాలను ఒడిసిపట్టి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి సీఎం కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టును నిర్మించింది. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటిని వినియోగించుకోవాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA) సూచనల మేరకు మూడు బ్యారేజీల్లోనూ నీటిని నిల్వ చేయకుండా గేట్లు తెరిచి ఉంచుతున్నారు.

ఇదే సమయంలో మేడిగడ్డ ప్రాంతానికి ప్రాణహిత నుంచి భారీగా నీరు చేరుతోంది. అక్టోబర్ 3న లక్ష క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం నమోదైనట్లు క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడించాయి. నీరు భారీగా దిగువకు ప్రవహిస్తున్నా దాన్ని కాళేశ్వరం వ్యవస్థ ద్వారా ఎల్లంపల్లికి తరలించలేని పరిస్థితి ఉందని అధికారులు వివరించారు. అంటే నీళ్లు లేవన్నది సమస్య కాదు. ఉన్న నీటిని ఎలా వినియోగించుకోవాలన్నదే అసలు ప్రశ్న.

నీళ్లను రైతులకు అందించండి- బీఆర్ఎస్ డిమాండ్

మేడిగడ్డ దగ్గర నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎత్తిపోసే అవకాశాలను ఎందుకు పరిశీలించడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ నాయకులు వరుసపెట్టి మేడిగడ్డ వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్నారు. ఆ నాయకులంతా సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. అవసరమైతే కాఫర్ డ్యామ్ నిర్మించి ఒక్క టీఎంసీ నీటినైనా ఎత్తిపోయాలనేది బీఆర్ఎస్ నాయకుల ప్రతిపాదన.

బ్యారేజీల మరమ్మతులు జరగాల్సిందే. నిర్మాణ లోపాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆ పనులు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలను ఎందుకు పరిశీలించకూడదు? రైతులకు ప్రయోజనం కలిగించే మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? తెలంగాణ ప్రజల మనస్సుల్లో కూడా ఈ ప్రశ్నలే మెదులుతున్నాయి.

అయితే బీఆర్ఎస్ సూచిస్తున్న తాత్కాలిక కాఫర్ డ్యామ్ ప్రతిపాదన సాంకేతికంగా సాధ్యమా? దాని వల్ల బ్యారేజీల భద్రతకు ఇబ్బంది కలుగుతుందా? ఎంత నీటిని ఎత్తిపోయవచ్చు? ఈ అంశాలపై నిపుణుల సమాధానాలే కీలకం. దీనిపై ఎవరు మాట్లాడినా రాజకీయాలే ముందుకొస్తాయి. అసలు విషయం పక్కకు వెళ్తుంది.

మేడిగడ్డ దగ్గర నీటిని ఎత్తిపోయాలంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు ఇప్పుడు మరో చర్చకు కారణమైంది. ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి.

సీఎం ఏమన్నారు..?

"ఏబీసీడీలు రాని వాళ్లు, బర్లు కాసుకునే వాళ్లందరూ, బర్లకాడ ఉండే ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్లు కాళేశ్వరం దగ్గరికి పోయి సెల్ఫీలు దిగి ఫొటోలు పెడుతున్నారు. ఇక్కడ నీళ్లు పోతున్నయి చూడుర్రి అని చెబుతున్నారు. పోయే నీళ్లు ఎత్తేటట్టుంటే బ్యారేజీలు ఎందుకు కట్టిర్రు?" అంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. ఐతే.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించుకోవాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా ఎద్దేవా చేయడం ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నిజానికి మేడిగడ్డ దగ్గరకు వెళ్లి చూస్తే కనిపించేది గోదావరి నీటి ప్రవాహమే. నీళ్లు పరవళ్లు తొక్కుతూ దిగువకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాటిని చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐతే ఆ నీటిని ఎత్తిపోయడం సాధ్యమా కాదా అనేది మాత్రం సాంకేతిక అంశం.

నీటిని ఎత్తిపోయడం నిజంగానే సాధ్యం కాదా?

ఇక్కడే అసలు టెక్నికల్ అంశాన్ని అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ దగ్గర నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పి వెంటనే పంపులు ఆన్ చేయడం సాధ్యం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి వైపు తరలించాలంటే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు అవసరం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు కనీసం 93.50 మీటర్ల నీటిమట్టం అవసరం. కానీ మేడిగడ్డ వద్ద అప్పటికి నమోదైన నీటిమట్టం 89.90 మీటర్లు మాత్రమే. అంటే అవసరమైన స్థాయి కంటే 3.60 మీటర్లు తక్కువగా ఉంది.

అంతేకాదు, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసిన తర్వాత ఆ నీరు ముందుకు వెళ్లాలంటే మధ్యలోని బ్యారేజీల పరిస్థితి కూడా అనుకూలంగా ఉండాలి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి గేట్లు మూసివేయాల్సి ఉంటుంది. కానీ వాటి భద్రతపై NDSA అభ్యంతరాలు ఉన్నందున గేట్లు మూసివేయలేని పరిస్థితి ఉందని ప్రభుత్వం చెబుతోంది.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 2022 గోదావరి వరదల సమయంలో మోటార్లు, విద్యుత్ పరికరాలు నీట మునిగి దెబ్బతిన్నాయని, పంప్‌హౌస్ పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. అంటే మేడిగడ్డ దగ్గర నీరు ప్రవహిస్తున్నప్పటికీ దాన్ని ఎత్తిపోయడానికి అవసరమైన నీటిమట్టం, పంపుల పనితీరు, మధ్యలోని బ్యారేజీల భద్రత వంటి సమస్యలు ఉన్నాయి.

రోజుకు రూ.కోటి కరెంటు ఖర్చువుతుందా..?

కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చలో చాలామంది ప్రస్తావించని మరో కీలక అంశం విద్యుత్ ఖర్చు. ఇది సాధారణ మోటార్లతో నడిచే చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కాదు. భారీ మోటార్లు, పంపులు, విద్యుత్ వ్యవస్థలతో పనిచేసే ప్రాజెక్టు. నీటిని వందల మీటర్ల ఎత్తుకు తరలించాల్సి ఉంటుంది. అందుకు భారీగా విద్యుత్ అవసరం.

కాగ్ తన కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు ఆడిట్ నివేదికలో మేడిగడ్డ లిఫ్ట్‌కు సంబంధించిన విద్యుత్ వినియోగ వివరాలను వెల్లడించింది. మేడిగడ్డ లిఫ్ట్‌కు సంబంధించిన గరిష్ఠ సామర్థ్యం 680 మెగావాట్లు. అన్ని పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే రోజుకు 16.32 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. యూనిట్‌కు రూ.6.30 చొప్పున లెక్కిస్తే రోజుకు సుమారు రూ.1.03 కోట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. అంటే అన్ని పంపులు 24 గంటలపాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఒక్కరోజుకే కోటి రూపాయలకు పైగా విద్యుత్ ఖర్చు అవుతుంది.

అయితే కోట్ల రూపాయల విద్యుత్ ఖర్చు అవుతుందని నీటిని వినియోగించుకోకుండా వదిలేయాలా? లేక రైతులకు అందే ప్రయోజనం, విద్యుత్ ఖర్చు, ఇతర ప్రత్యామ్నాయాలను పోల్చి నిర్ణయం తీసుకోవాలా? దీనిపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు బయటపెట్టాలి.

ప్రభుత్వ వాదనలో ఏముంది?

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న ప్రధాన వాదన కాళేశ్వరం బ్యారేజీల భద్రత. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు ఉన్నాయని NDSA గుర్తించింది. వాటిని పునరుద్ధరించే వరకు నీటిని నిల్వ చేయడం, మళ్లించడం ప్రమాదకరమని సూచించింది. ముఖ్యమంత్రి మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. గోదావరి దిగువ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నీటిని పూర్తిగా వృథాగా వదిలేయకుండా దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వినియోగిస్తున్నామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే, తమ ప్రభుత్వం సగటున 18.13 టీఎంసీలు ఎత్తిపోసిందని లెక్కలు చెబుతున్నారు. అంటే ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే.. కాళేశ్వరం బ్యారేజీలను సురక్షితం కాని పరిస్థితుల్లో ఉపయోగించడం కంటే, అందుబాటులో ఉన్న ఇతర ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకోవడమే మంచిదని.

ఈ వాదనలో భద్రతకు సంబంధించిన అంశాన్ని కొట్టిపారేయలేం. బ్యారేజీలు దెబ్బతిన్నాయని తెలిసిన తర్వాత వాటిని మళ్లీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉపయోగించడం సరైనది కాదు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తున్న నీటి పరిమాణం, కాళేశ్వరం ద్వారా సాధ్యమయ్యే నీటి వినియోగం, రైతులకు అందుతున్న ప్రయోజనం వంటి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలి.

రూ.4,193 కోట్లతో మరమ్మతులు.. రైతులకు నీళ్లు ఎప్పటికి?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సుమారు రూ.4,193 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసింది. నవంబర్ 5న జరిగిన సమీక్షలో అవసరమైన అనుమతులు తీసుకుని డిసెంబర్ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కేంద్ర జల సంఘం, NDSA సూచనలకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ లోపాలకు సంబంధించిన ఖర్చును సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలే భరించాలని, అదనపు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని వెల్లడించింది. అయితే ఈ పనులు ప్రారంభమైతే ఎప్పటికి పూర్తవుతాయి? కాళేశ్వరం ద్వారా నీటిని తిరిగి ఎప్పుడు ఎత్తిపోస్తారు? యాసంగి పంటలకు ఎంతమేర సాగునీరు అందుతుంది? రైతులకు ఇప్పుడున్న అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం

మేడిగడ్డ విషయంలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎన్ని ఉన్నా రైతులకు మాత్రం న్యాయం చేయాల్సిందే. కాళేశ్వరం నిర్మాణంలో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బ్యారేజీలను సురక్షితంగా పునరుద్ధరించాలి. కానీ అదే సమయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవచ్చో కూడా పరిశీలించాలి.

బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా తాత్కాలిక ఏర్పాట్లతో నీటిని ఎత్తిపోయడం సాధ్యమైతే దానిపై నిపుణుల నివేదిక తీసుకోవాలి. సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో ప్రభుత్వం సాంకేతిక వివరాలతో చెప్పాలి. విద్యుత్ ఖర్చు ఎంతవుతుంది? ఎంత నీరు అందించవచ్చు? ఎన్ని ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది? ఎంత సమయం పడుతుంది? ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల ద్వారా ఎంత నీటిని అందించగలుగుతారు? ఇవన్నీ బహిరంగంగా వెల్లడించాలి. అప్పుడే రైతులకు, తెలంగాణ ప్రజలకు అసలు వాస్తవాలు తెలిసే అవకాశముంది.

తర్వాత చదవండి