Foreign Investors: దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తెలుగు దిగ్గజ సంస్థ ‘మేఘా ఇంజినీరింగ్ గ్రూప్’ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కంపెనీ మొత్తం విలువ సుమారు రూ. లక్ష కోట్లకు చేరడంతో పాటు, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 700 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ఆకర్షించింది.
రంగంలోకి మూడు గ్లోబల్ సంస్థలు
మేఘా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్మెంట్ సంస్థలైన డీకే, హెచ్‌హెచ్, వర్డే పార్ట్నర్స్ ముందుకు వచ్చాయి. స్ట్రక్చర్డ్ ఈక్విటీ పెట్టుబడులు, రోడ్ అసెట్స్ మానిటైజేషన్ ద్వారా ఈ 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు డీల్ కుదిరింది. మరోవైపు, గ్రూపునకు చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ విభాగం ఈపీటీఎల్ విలువను కూడా రూ. 14 వేల కోట్లుగా అంచనా వేశారు.
20 దేశాల్లో విస్తరణ.. భారీ ప్రాజెక్టులు
ప్రస్తుతం 20కి పైగా దేశాల్లో మేఘా ఇంజినీరింగ్ భారీ ప్రాజెక్టులను చేపడుతోంది. దేశవ్యాప్తంగా 1,975 కిలోమీటర్లకు పైగా హైవే ప్రాజెక్టులతో పాటు జోజిలా టన్నెల్, ముంబయి కోస్టల్ రోడ్, పోలవరం వంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణాల్లో కీలక భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా 9,110 మెగావాట్లకు పైగా పంప్డ్ స్టోరేజ్, 3,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తూనే న్యూక్లియర్ పవర్ (అణు విద్యుత్) రంగంలోనూ అడుగుపెట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు, ఆయిల్ అండ్ గ్యాస్, తయారీ, గ్యాస్ పంపిణీ రంగాల్లోనూ కంపెనీ వేగంగా విస్తరిస్తోంది. భారత ఇన్ఫ్రా రంగంలో గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఉన్న అపారమైన నమ్మకానికి మేఘా గ్రూప్ సాధించిన ఈ అరుదైన గుర్తింపు నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు.
