భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్న తొలి ప్రైవేట్ పీఎస్ఎల్వీ రాకెట్ 'పీఎస్ఎల్వీ-ఎన్1' (PSLV-N1) తొలి ప్రయోగం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ ఏడాదిలోనే కనీసం రెండు ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని 2027 ప్రారంభంలో చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), లార్సెన్ & టూబ్రో (L&T) నేతృత్వంలోని కన్సార్టియం ఈ రాకెట్‌ను నిర్మిస్తోంది.
ఇస్రోకు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం 'ఈఓఎస్-10' (EOS-10)ను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపాలని ప్రణాళిక రూపొందించారు. అయితే పేలోడ్‌తో సమన్వయం, ప్రయోగానికి అనుకూలమైన లాంచ్ విండో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఆలస్యం జరుగుతోందని ఎల్ అండ్ టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎ.టి. రాంచందాని 'ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ కాన్క్లేవ్' వేదికగా వెల్లడించారు. 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఐదు పీఎస్ఎల్వీ రాకెట్లను తయారు చేసే బాధ్యతను హెచ్ఏఎల్-ఎల్ అండ్ టీ కన్సార్టియం దక్కించుకుంది.
ఒప్పంద నిబంధనల ప్రకారం రెండేళ్లలో మొదటి రాకెట్‌ను, ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక రాకెట్ చొప్పున 2026 నాటికి మొత్తం ఐదింటిని అందించాల్సి ఉంది. కానీ ప్రయోగ వాహనం సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇస్రో ఇటీవల ఎదుర్కొన్న రెండు వరుస వైఫల్యాలే ప్రస్తుత జాప్యానికి ప్రధాన కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇస్రోకు అత్యంత నమ్మకమైన రాకెట్‌గా పేరుగాంచిన పీఎస్ఎల్వీ ఇప్పటివరకు 107 ప్రయోగాల్లో 65 విజయాలను అందించింది.
అయితే 2025 మే 18న పీఎస్ఎల్వీ-సీ61, 2026 జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగాల్లో మూడో దశలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల వరుసగా రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగా ఇస్రో తన సొంత పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాతే ప్రైవేట్ రాకెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంది. గత వైఫల్యాలపై విచారణ జరిపిన కమిటీ సిఫార్సుల మేరకు రాకెట్‌లోని కొన్ని కీలక విడిభాగాల సరఫరాదారులను మార్చడంతో పాటు సాంకేతిక లోపాలను పూర్తిగా సరిదిద్దినట్లు సమాచారం.
ఇదే అంశంపై ఎల్ అండ్ టీ ప్రతినిధి రాంచందాని మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో నిజమైన స్వావలంబన సాధించాలంటే 'స్పేస్ కాంపోనెంట్స్ మిషన్' అత్యవసరమని అభిప్రాయపడ్డారు. కేవలం విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తే సరిపోదని, రేడియేషన్ తట్టుకునే ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, ప్రొపల్షన్ వ్యవస్థలను దేశీయంగానే డిజైన్ చేసి తయారు చేసే స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు.
