హైదరాబాద్ వాసులకు ఆపిల్ (Apple) కంపెనీ శుభవార్త చెప్పింది.ఇంతకాలం ఆపిల్ ఉత్పత్తులను ఆన్లైన్, థర్డ్ పార్టీ స్టోర్స్ (బజాజ్ ఎలక్ట్రానిక్స్,రిలయన్స్,పై ఎలక్ట్రానిక్స్, టాటాక్రోమా)లో కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఇకపై నేరుగా ఆపిల్ సొంత బ్రాంచిలోనే కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు నగరంలో ఆపిల్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భాగ్యనగరంలో తమ మొట్టమొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ను 10 డిసెంబర్ 2026న ప్రారంభించనున్నట్లు ఆపిల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
స్టోర్ ఏర్పాటు ఎక్కడ?
హైదరాబాద్‌లోని ప్రధాన వాణిజ్య ప్రాంతమైన కూకట్‌పల్లిలో ఈ ప్రతిష్టాత్మక స్టోర్ కొలువుదీరనుంది.దీంతో ఆపిల్ వినియోగదారులు సంస్థ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, థర్డ్ పార్టీ స్టోర్లలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆపిల్ సొంత బ్రాంచ్ ఏర్పాటు చేయడంతో క్వాలిటీ ప్రొడక్ట్స్ లభిస్తాయని భావిస్తున్నారు.డిఫాల్ట్ ప్రొడక్ట్స్ డెలివరీ తీసుకున్న క్రమంలో ఎక్స్ఛేంజ్, రీఫండ్ రాక చాలా మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తెలంగాణలోనే తొలి స్టోర్..
భారతదేశంలో ఇప్పటికే ముంబై (BKC), న్యూఢిల్లీ (సాకేత్) నగరాల్లో ఆపిల్ అధికారిక స్టోర్లు విజయవంతంగా కొనసాగుతుండగా, దక్షిణ భారతదేశంలో కీలకమైన టెక్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఈ స్టోర్ ఏర్పాటు కావడం విశేషం. తెలంగాణలో ఇది తొలి స్టోర్ కాగా, దక్షిణ భారతంలోనే ఏర్పాటయ్యే తొలి స్టోర్ కానుంది. డిసెంబర్ 10న ఉదయం ఈ స్టోర్‌ను వినియోగదారుల కోసం తెరవనున్నట్లు ఆపిల్ కీలక ప్రకటన చేసింది.
స్టోర్ ప్రత్యేకతలు ఏంటంటే?
ఇప్పటివరకు థర్డ్ పార్టీ రీసెల్లర్ల ద్వారానే ఆపిల్ ఉత్పత్తులు లభిస్తుండగా.. స్టోర్ ప్రారంభం అయ్యాక నేరుగా ఆపిల్ సంస్థ ఆధ్వర్యంలోనే ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్లు, ఆపిల్ వాచీలు, ఇతర యాక్సెసరీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఉత్పత్తుల రిపేర్లు, సాంకేతిక సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా 'జీనియస్ బార్' సేవలు అందుబాటులో ఉంటాయి.'టుడే ఎట్ ఆపిల్' కార్యక్రమం కింద ఫోటోగ్రఫీ, మ్యూజిక్, కోడింగ్ వంటి అంశాల్లో నిపుణులతో ఉచిత శిక్షణా తరగతులు సైతం నిర్వహిస్తారు. ఇతర ఆపిల్ స్టోర్ల తరహాలోనే పూర్తిగా 100% పునరుత్పాదక ఇంధనంతో (Renewable Energy) నడిచేలా, కార్బన్ న్యూట్రల్ ప్రమాణాలతో ఈ స్టోర్‌ను తీర్చిదిద్దినట్టు సమాచారం .
