రాజకీయాలు

KTR : రాహుల్ కుర్చీలోని టిష్యూను రేవంత్ రెడ్డి తీస్తున్నాడు : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అబద్ధపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నేతలు రాగానే గజగజ వణుకుతున్నాడని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అబద్ధపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నేతలు రాగానే గజగజ వణుకుతున్నాడని విమర్శించారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌ పార్టీలో చేరికలు జరిగాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రియాంక గాంధీ రాగానే ఆమె బాడీ గార్డులు రేవంత్ రెడ్డిని నూకేస్తారు. వాడు చిన్నగా ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి.. వాడిని నూకేయకండి’అని అన్నారు.

రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చుంటే రేవంత్ రెడ్డి టిష్యూలు తీస్తున్నాడని, మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే ఆయన బండి వెనక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రి వివేక్ వెంకట స్వామి ఉరుకుతున్నారని గుర్తుచేశారు.కాంగ్రెస్ పార్టీకి ఒకటే కాదు ఇంకో ఢిల్లీ పార్టీకి కూడా ఇదే జబ్బు ఉందని, ఒకాయన అమిత్ షా రాగానే చెప్పులు ఎప్పుడు విప్పుతాడా? అని చూస్తాడని సెటైర్లు వేశారు.

సొంత పార్టీ నేతలతోనే రేవంత్‌కు రిస్క్..

సొంత పార్టీ నేతలతోనే రేవంత్ రెడ్డికి ముప్పు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్ రెడ్డి బట్టలు విప్పుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 15, 20 పర్సెంటేజ్ కమీషన్ లేనిది ఏ పని కావడం లేదని వాళ్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని, ఆయన దొంగ అని ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడని కేటీఆర్ గుర్తుచేశారు.

పెన్షన్లలో కోత..

ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 లక్షల 70 వేల పాత పెన్షన్లు తీసేసి కొత్తగా 4 లక్షల 63 వేల పెన్షన్లు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్లు 44 లక్షల 70 వేలు అని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో లక్షా 50 వేల పెన్షన్లు తీసేసిందని, రెండో సంవత్సరం మరొక లక్షా 50 వేలు తీసేసిందన్నారు. మూడో సంవత్సరం లక్షా 70 వేలు తీసేసిందని ఆరోపించారు. ఇంక పెంచింది ఎక్కడ?అని అడిగారు. దీనికి సమాధానం గత బడ్జెట్ లెక్కలు చూస్తే అర్థం అవుతుందని కేటీఆర్ అన్నారు.పెన్షన్లు పెంచితే బడ్జెట్‌లో నిధులు పెరగాలని, మరి ఎందుకు పెరగలేదని కేటీఆర్ నిలదీశారు.

తర్వాత చదవండి