రాజకీయాలు

Congress : కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు!

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదం రాజుకుంది. మొన్నటివరకు సైలెంట్ అయిన బీసీ వాదం మరోసారి తెరమీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంతవరకూ ఆ విధంగా చర్యలు చేపట్టలేదు. హైకోర్టు,సుప్రీంకోర్టు జోక్యంతో చివరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదం రాజుకుంది. మొన్నటివరకు సైలెంట్ అయిన బీసీ వాదం మరోసారి తెరమీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంతవరకూ ఆ విధంగా చర్యలు చేపట్టలేదు. హైకోర్టు,సుప్రీంకోర్టు జోక్యంతో చివరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియలో ఎలాంటి ముందడుగు పడలేదు. అయితే, వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రయారిటీ ఇచ్చిందని.. రెడ్డి నేతలకు కూడా తగిన ప్రాధాన్యత లభించిందని, తమకు మాత్రం అన్యాయం జరిగిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు.

పార్టీ పరంగా బీసీలకు ప్రాధాన్యత..!

ప్రభుత్వం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకూ దానిపై మరల ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ మేరకు అడుగులు కూడా పడలేదు. మరో రెండేళ్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి టైముంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా? అన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లోనే లేకుండా పోయింది.ఒక్కొక్కరూ ఒక్కోలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మంత్రులకు సైతం మరోసారి ప్రభుత్వ ఏర్పాటుపై భరోసా లేకుండా పోయిందని పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

తెరపైకి బీసీ డిప్యూటీ సీఎం..

ఈ క్రమంలోనే బీసీ నేతలు దూకుడు పెంచినట్టు సమాచారం. మరో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం టర్మ్ ముగుస్తుంది. మరల అధికారంలోకి వస్తామని ఎవరికీ నమ్మకం లేకపోవడంతో త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలని హైకమాండ్‌కు పలువురు బీసీ నేతలు విన్నవించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. బీసీలకు రాజకీయ అధికారంలో పెద్దపీట వేయాలనే డిమాండుతో పాటు బీసీ నేతకు పీఠం ఇవ్వాలంటూ రాహుల్‌కు రాయబారం పంపినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే, బీసీ నేతకు సైతం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ హైకమాండ్‌కు ప్రతిపాదనలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.వచ్చే నెలలోనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని బీసీ నేతలు హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులతో పాటు బీసీ డిప్యూటీ సీఎం పదవిపైనా నేతలు గురి పెట్టినట్టు సమాచారం. ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి ఈ ప్రతిపాదనకు ఆమోదం పొందాలని బీసీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణాలకు పదును పెడుతున్నట్టు తెలిసింది.కాగా, బీసీ డిప్యూటీ సీఎం ప్రతిపాదనకు ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలు అడ్డుపడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

తర్వాత చదవండి