తెలంగాణ

Harish Rao: బాంబే బ్రోకర్‌కి సీఎం రేవంత్ 500 కోట్లు లంచం ఇచ్చారు- హరీశ్ రావు

రేవంత్ పాలన అంతా భూముల చుట్టే తిరుగుతోందని మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం 26వేల ఎకరాలు అమ్మేసిందని ఆరోపించారు. భూములు (Govt Lands) అమ్మడమే రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరుతో పరిశ్రమల భూములు అమ్మేశారని చెప్పారు. భూములపై 46వేల కోట్లు అప్పుగా తెచ్చారని తెలిపారు. (Kukatpally Truck Park Land Auction)

Harish Rao: రేవంత్ పాలన అంతా భూముల చుట్టే తిరుగుతోందని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం 26వేల ఎకరాలు అమ్మేసిందని ఆరోపించారు. భూములు అమ్మడమే రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరుతో పరిశ్రమల భూములు అమ్మేశారని చెప్పారు. భూములపై 46వేల కోట్లు అప్పుగా తెచ్చారని తెలిపారు. గ్యారెంటీల అమలు సంగతేమో కానీ భూములను మాత్రం గ్యారెంటీగా అమ్ముతున్నారని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. భూములు అమ్మడానికే సీఎం అయ్యారా? అని రేవంత్ ను ప్రశ్నించారు హరీశ్ రావు. కూకట్ పల్లి హుడా ట్రక్ పార్కింగ్ భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీమంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.

భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ద పాలనపై లేదు

సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, సీఎం రేవంత్ నిత్యం భూముల చుట్టే తిరుగుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ద పాలనపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో ప్రభుత్వాలు భూములు అమ్మితే నిరర్దక ఆస్తులు, ప్రజలకు ఉపయోగపడని భూములు అమ్మేవి.. కానీ రేవంత్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

కూకట్ పల్లి ట్రక్ పార్కింగ్ భూమి ప్రభుత్వ భూమి కాదు

కూకట్ పల్లి ట్రక్ పార్కింగ్ భూమి ప్రభుత్వ భూమి కాదని.. ట్రక్ పార్కింగ్ భూమి అని, ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే ఉందని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఒక ప్రత్యేకమైన అవసరం కోసం ఆనాడు భూమి సేకరించడం జరిగిందని వివరించారు. పబ్లిక్ పర్పస్ కోసం, ట్రక్ పార్కింగ్ కోసం అని ఆర్డర్ ఉందన్నారు. ఇప్పుడు దాన్ని పక్కనబెట్టి అమ్మేస్తాం అంటున్నారని మండిపడ్డారు. ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారం, తిరిగి రైతులకు ఇవ్వాలి తప్ప ఇష్టం ఉన్నట్లు వినియోగించడం కుదరదని హరీశ్ రావు పేర్కొన్నారు.

బ్రోకర్‌కు 500 కోట్ల లంచం ఇచ్చారు

సీఎం రేవంత్ ఇప్పటికే 26వేల ఎకరాల భూమి అమ్మేశారు. 20 వేల ఎకరాల భూమిని బాంబే స్టాక్ ఎక్సేంజీలో కుదువ పెట్టి బ్రోకర్ కు 500 కోట్ల లంచం ఇచ్చి 20వేల కోట్లు అప్పు తెచ్చారు. హెచ్ఎండీఏలో 800 ఎకరాల భూముల విషయంలో అదే బ్రోకర్ కు 250 కోట్లు లంచం ఇచ్చి 10వేల కోట్లు అప్పు తెచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేనిది బ్రోకర్లకు 500 కోట్ల లంచం అధికారికంగా ఇచ్చి భూములు అమ్ముతున్నారు. మియాపూర్ లో 400, మామిడిపల్లిలో 400 ఎకరాలు అమ్ముతా అంటున్నారు. అంటే 50వేల కోట్ల భూములను ఈ సంవత్సరం అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నారు.

కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే భూముల అమ్మకాలు

కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం భూములు అమ్ముతున్నారు తప్ప ప్రజల కోసం కాదు. గ్యారెంటీల అమలు మరిచిపోయి, భూములను గ్యారెంటీగా అమ్ముతున్నారు. కాప్రాలో 400 గజాలు, అమీన్ పూర్ లో 300 గజాలు, బాచుపల్లిలో 490 గజాలు.. ఇలా గజాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఎల్ నినో దెబ్బకు నీళ్ల కరువు వస్తే, రేవంత్ పిచ్చి తుగ్లక్ చర్య వల్ల భూముల కొరత వచ్చే ప్రమాదం ఉంది. తిక్కలోడు తిరునాళ్లకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయింది అన్నట్లుంది రేవంత్ పాలన.

ఈ భూమి అమ్మేస్తే కంటైనర్ కార్పొరేషన్ ఎలా నడవాలి?

హెచ్‌సీయూ భూములు, ఉర్దూ యూనివర్సిటీ భూములు, అసైన్డ్ భూములు అమ్మకానికి పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి.. ఇష్టం ఉన్నట్లు అమ్ముతున్నారు. భూమి కనిపిస్తే చాలు అమ్ముడే అమ్ముడు. చిన్న స్థలాల్లో స్కూల్, పార్క్, హాస్పిటల్ కూడా పెట్టొచ్చు కదా. ట్రక్ పార్కింగ్ ఎంతో ముఖ్యం. రోజుకు వెయ్యి కంటైనర్లు లోడ్ అవుతాయి. ఈ భూమి అమ్మేస్తే కంటైనర్ కార్పొరేషన్ ఎలా నడవాలి? కార్మికుల పరిస్థితి ఏం కావాలి? మీకు కనీసం సోయి లేదు. ఏది అమ్మాలో కూడా తెలియదు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ మధ్యన ఉన్న ఒకే ఒక ప్రాంతం ఇది. జనాభా పెరుగుతుంటే వారి అవసరాలకు తగినట్లు ఏర్పాట్లు ఎలా చేస్తారు. దేవాలయ భూములు, ఎన్విరాన్ మెంట్ భూముల, అసైన్డ్ భూములు అన్నీ అమ్ముతున్నారు.

ట్రక్ పార్కు భూమి వేలాన్ని ఆపాలి

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భూమి, నర్సరీ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, ఆర్టీఏ కార్యాలయం అక్కడే ఉంది. వాటన్నింటిని అమ్మేస్తారా? రేవంత్ గతంలో మాట్లాడిన మాటలు వింటే ఊసరవెల్లి కూడా ఉరి వేసుకుంటుంది. తక్షణమే కూకట్ పల్లి హుడా ట్రక్ పార్కు భూమి వేలాన్ని రద్దు చేయాలని అఖిలపక్షం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ వేలాన్ని రద్దు చేయకుంటే 22, 23 తేదీల్లో జరిగే నిరాహార దీక్షలో బీఆర్ఎస్ ప్రత్యక్షంగా పాల్గొంటుంది. 25వ తేదీన హెచ్ఎండీఏ ముట్టడిలో బీఆర్ఎస్ పాల్గొంటుంది. ట్రక్ పార్క్ వేలాది మంది ప్రజలకు బతుకుదెరువు. వేలాది మంది జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది

పదేళ్ల ముందు బీఆర్ఎస్ ఈ భూములను కాపాడింది. నేడు మళ్లీ బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. కార్మికుల కోరిక మేరకు మేం పూర్తి మద్దతిస్తున్నాం. సీపీఐ, సీపీఎం సహా అన్ని వామపక్షాలు కలుపుకుని బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఓవైపు ప్రభుత్వ రంగం సంస్థలను, ప్రభుత్వ భూములను అమ్మొద్దని రాహుల్ గాంధీ చెబుతుంటే.. మరోవైపు రేవంత్ అదే పనిగా భూములు అమ్ముతున్నారు. రాహుల్ మాటకు విలువ లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. హైకమాండ్ చొరవ చూపి రేవంత్ కు బుద్ది చెప్పాలి. లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. ప్రజలు తగిన బుద్ధి చెబుతారు'' అని హరీశ్ రావు హెచ్చరించారు.

తర్వాత చదవండి