తెలంగాణ

Telangana Congress: కొండా సురేఖకు అలా.. రాజగోపాల్ రెడ్డికి ఇలా.. ఏంటిది రేవంత్?

Telangana Congress: అధికార కాంగ్రెస్ పార్టీలో ‘క్రమశిక్షణ’ అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న కఠిన నిర్ణయాన్ని, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలను పోలుస్తూ గాంధీ భవన్ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Telangana Congress: అధికార కాంగ్రెస్ పార్టీలో ‘క్రమశిక్షణ’ అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న కఠిన నిర్ణయాన్ని, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలను పోలుస్తూ గాంధీ భవన్ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ లైన్ దాటితే అందరికీ ఒకే రకమైన రూల్స్ వర్తిస్తాయా? లేక ఒక్కో నేతకు ఒక్కో న్యాయం ఉంటుందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

కొండా సురేఖ విషయంలో ఏం జరిగింది?

గత సెప్టెంబర్‌లో తన కుమార్తె సుస్మిత పటేల్, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన బహిరంగ విమర్శల వ్యవహారం కొండా సురేఖ పదవికి ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. కుమార్తె చేసిన కామెంట్స్‌ను ఖండించలేదన్న కారణంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు, సీఎం రేవంత్ రెడ్డి ఆమెను ఏకంగా కేబినెట్ నుంచే తొలగించారు. నాడు పార్టీ ప్రతిష్టకు క్రమశిక్షణే పరమావధి అని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పష్టం చేయగా, తన కుమార్తె అన్న మాటలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా తొలగించడం అన్యాయమని కొండా సురేఖ అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం జరుగుతోంది?

తాజాగా మునుగోడు నియోజకవర్గ నిధుల విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కొడంగల్‌కు పది వేల కోట్లు కాదు ఇరవై వేల కోట్లు తీసుకోండి.. కానీ మునుగోడుకు నిధులు ఆపితే మరో కురుక్షేత్రం సృష్టిస్తా’’ అంటూ ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, సీఎం ఉపయోగించే భాషపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అదృష్టం కొద్దీ సీఎం అయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగా మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఆరోపించారు.

రెండు ఎపిసోడ్స్ మధ్య చర్చకు దారితీస్తున్న అంశాలు..

కుమార్తె చేసిన వ్యాఖ్యలకే ఓ బీసీ మహిళా మంత్రిని ఏకంగా కేబినెట్ నుంచి తప్పించిన హైకమాండ్, ఇప్పుడు స్వయంగా ఓ ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రినే ఉద్దేశించి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ విషయంలో చూపిన దూకుడును ఇక్కడ కూడా ప్రదర్శిస్తారా? లేక కొత్త ఇన్‌ఛార్జ్ ద్వారా చర్చలు జరిపి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేస్తారా? అనేది చూడాలి.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, నిధుల కేటాయింపులో అసమానతల గురించి నేతలు మాట్లాడినప్పుడు క్రమశిక్షణ పేరుతో కట్టడి చేయడం ఎంతవరకు సమంజసమని కొందరు నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి, కొండా సురేఖ ఎపిసోడ్‌లో అధిష్ఠానం తీసుకున్న కఠిన నిర్ణయం తర్వాత, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఎలా డీల్ చేస్తుందనేది తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

తర్వాత చదవండి