తెలంగాణ

Telangana Politics: కృష్ణా జలాల చుట్టూ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు.. మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జల వివాదం కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మళ్లీ అదే ‘నీళ్ల సెంటిమెంట్’ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జల వివాదం కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మళ్లీ అదే ‘నీళ్ల సెంటిమెంట్’ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని ఆరోపిస్తున్న నిర్మాణాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని, మరో భారీ ప్రజా ఉద్యమానికి గులాబీ దళం రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు వివాదం ఏంటి?

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతులు లేకుండానే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ (విజయపురి సౌత్) నుంచి సొరంగం, పైప్‌లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించేందుకు పనులు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పల్నాడు తాగునీటి పథకం పేరుతో సుమారు 90 టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతోందని, ఇది భవిష్యత్తులో మరో పోతిరెడ్డిపాడులా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఏడాదిగా పనులు జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ వద్ద మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.

గులాబీ పార్టీ ‘మాస్టర్ ప్లాన్’ వెనుక ఉన్న అంశాలు ఇవే..

రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ప్రకారం.. బీఆర్ఎస్ ఈ అంశాన్ని బలంగా ఎత్తుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. పదేళ్ల పాలన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్, ప్రజలతో మళ్లీ బలంగా మమేకమయ్యేందుకు తెలంగాణ అస్తిత్వంతో ముడిపడి ఉన్న ‘నీళ్ల సెంటిమెంట్’ను సరైన మార్గంగా భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చినా, అది ఎన్నికల స్టంట్‌గా భావించడంతో ఆశించిన ఫలితం దక్కలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి ఆధారాలతో ప్రజల్లోకి వెళ్తే స్పందన ఉంటుందని గులాబీ నాయకత్వం అంచనా వేస్తోంది.

ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల సాగునీటి ప్రయోజనాలకు, అలాగే భవిష్యత్తులో హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందనే కోణంలో ప్రజలను ఏకం చేయాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ ఇప్పటికే వెల్లడించారు. ముందుగా ఆయా జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ తరహాలో కృష్ణా జలాల పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది?

మరోవైపు, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిందని, 811 టీఎంసీలలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీల వాటాకు ఒప్పుకుని చారిత్రక తప్పిదం చేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు 555 టీఎంసీల వాటా కోసం బలంగా వాదనలు వినిపిస్తోందని ఉత్తమ్ స్పష్టం చేశారు. రూల్స్‌కి విరుద్ధంగా ఏపీ చేపట్టే ఎలాంటి ప్రాజెక్టునైనా అడ్డుకుంటామని, రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. మొత్తానికి, ఒకవైపు అక్రమ నిర్మాణాలంటూ బీఆర్ఎస్ ఉద్యమ బాట పడుతుండగా, మరోవైపు గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ సర్కార్ కౌంటర్ ఇస్తుండటంతో తెలంగాణలో కృష్ణా జలాల రాజకీయం మరింత వేడెక్కింది.

తర్వాత చదవండి