తెలంగాణ

KTR Tweet: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ సంకల్పంతో సాగిన పోరాటం.. దేశ రాజకీయాలనే మార్చింది: కేటీఆర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలోనే కీలక మలుపుగా నిలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ‘దీక్షా దివస్’(Deeksha Diwas) సందర్భంగా ఆనాటి ఘట్టాలను స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు.

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలోనే కీలక మలుపుగా నిలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ‘దీక్షా దివస్’(Deeksha Diwas) సందర్భంగా ఆనాటి ఘట్టాలను స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష జాతీయ రాజకీయాల గమనాన్నే మార్చిందని కేటీఆర్ వివరించారు.

 ప్రాణాలకు తెగించి సాగించిన ఆ పోరాటం నాటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిందని, ‘ఒక దీక్ష.. ఒక సంకల్పం.. ఒక రాష్ట్రం’ అనే లక్ష్యంతో ఆయన అవిశ్రాంతంగా ముందుకు సాగారని కొనియాడారు. నవంబర్ 29 నాటి దీక్ష చోటుచేసుకోకపోతే డిసెంబర్ 9 ప్రకటన వెలువడేది కాదని, తద్వారా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సాధ్యమయ్యేది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల అణచివేత నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు ఓ భూమిపుత్రుడు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మరోవైపు ‘దీక్షా దివస్’ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. 2009లో దీక్షకు వెళ్తున్న సమయంలో కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ప్రదేశం ఇదే కావడంతో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది; ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 ఉద్యమ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించేందుకు, రాష్ట్ర హక్కులు, ప్రజల ఆకాంక్షల సాధనలో పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు. దీక్షా దివస్ వేదికగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

తర్వాత చదవండి