క్రైమ్

Bus Accident: సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిసిన తర్వాత విషాదం.. బస్సుల మధ్య నలిగి మహిళ దుర్మరణం!

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ముగిసిన అనంతరం హుస్నాబాద్ వద్ద తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సభ పూర్తయ్యాక స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో బస్సుల మధ్య చిక్కుకుని ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ముగిసిన అనంతరం హుస్నాబాద్ వద్ద తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సభ పూర్తయ్యాక స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో బస్సుల మధ్య చిక్కుకుని ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా పనిచేస్తున్న మహిళ ఇలా దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్ మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) గురువారం రాత్రి నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు హాజరయ్యారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ప్రసంగం ముగియగానే, ఇంటికి వెళ్లేందుకు సారవ్వ వాహనాల పార్కింగ్ ప్రాంతం వైపు నడిచారు. ఆ సమయంలో తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే తొందరలో బస్సు డ్రైవర్లు అజాగ్రత్తగా, ఇష్టారాజ్యంగా వాహనాలను నడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయిన సారవ్వ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది.

 ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు. ఈ దుర్ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 ప్రభుత్వం తరఫున కొమ్ము సారవ్వ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తర్వాత చదవండి