తెలంగాణ

TG: గాంధీ కుటుంబంపై మాట్లాడే స్థాయి నీది కాదు.. కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్!

TG: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

TG: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, నాగార్జున సాగర్ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

సోనియా గాంధీ వల్లే మీకు పదవులు, ఆస్తులు

కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదని ఆయన గుర్తుచేశారు. "సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంది. ఆమె తెలంగాణ ఇవ్వడం వల్లే మీకు పదవులు వచ్చాయి.. ఆస్తులు సంపాదించుకున్నారు. అలాంటి గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి నీది కాదు" అంటూ కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగార్జున సాగర్ చెక్కుచెదరలేదు.. నెహ్రూపై విమర్శలా?

ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్‌ను నిర్మించి 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్‌లో సుమారు 320 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటుందని, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సాగు అవసరాల కోసం సాగర్ నుంచి 260 టీఎంసీల నీటిని వాడుకుంటాయని వివరించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టుకు పునాది వేసిన జవహర్‌లాల్ నెహ్రూ గురించి విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.

సాగర్ ఘటనపై ఈఈపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

మరోవైపు, మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాగార్జున సాగర్ అంశంపై సంచలన కామెంట్స్ చేశారు. సాగర్ ఘటనపై నాగార్జున సాగర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) మల్లికార్జున్‌పై తాను తీవ్ర స్థాయిలో సీరియస్ అయినట్లు వెల్లడించారు. "నువ్వు ఆంధ్రా వాడివి అని సైలెంట్‌గా ఉన్నావా? సంవత్సరం నుంచి పనులు జరుగుతుంటే ఏం చేస్తున్నావ్?" అంటూ ఈఈని నిలదీసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. తాను గట్టిగా అడిగేసరికి ఈఈ మల్లికార్జున్ క్షమించమని రిక్వెస్ట్ చేశారని మంత్రి చెప్పారు. ఏపీకి చుక్క నీరు కూడా అదనంగా పోనిచ్చేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చిచెప్పారు. మొత్తానికి, సాగునీటి ప్రాజెక్టులు, గాంధీ కుటుంబం ప్రస్తావనతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజేశాయి.

తర్వాత చదవండి