తెలంగాణ

KTR: సొరంగం తవ్వి నాగార్జున సాగర్‌లో ఏపీ జలదోపిడీ- కేటీఆర్

KTR: నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అక్రమంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వుతుంటే తెలంగాణ ప్రభుత్వం మత్తు నిద్రలో ఉందని మండిపడ్డారు.

KTR: నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అక్రమంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వుతుంటే తెలంగాణ ప్రభుత్వం మత్తు నిద్రలో ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఏపీ జలదోపిడీపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు కేటీఆర్.

సంవత్సర కాలంగా పెద్ద సొరంగం తవ్వి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం

ఏ అనుమతి లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా నాగార్జున సాగర్ లో ఏపీ జల దోపిడీకి పాల్పడుతోందన్నారు కేటీఆర్. కేఆర్ఎంబీ అనుమతి లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు.. ఎవరికీ తెలియదు.. కనీసం 18 గంటలు పని చేసే ముఖ్యమంత్రికి సమాచారం కూడా లేదన్నారు. సంవత్సర కాలంగా పెద్ద సొరంగం తవ్వి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కింది నుంచి కూడా నీళ్లు తీసుకుపోయే విధంగా, తెలంగాణకు శాశ్వతంగా బొక్కగొట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా మన ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించకపోవడం దారుణం అన్నారు కేటీఆర్.

సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?

పేరుకి తాగునీటి పథకం కోసం అని ఏపీ చెబుతోంది.. కానీ వాస్తవంగా సాగునీటిని కూడా తీసుకొని పోయే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. 90 టీఎంసీల నీళ్ళను తీసుకెళ్లడానికి సాగర్ నుంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆరోజు ఆంధ్ర ముఖ్యమంత్రులు చేసిన ద్రోహం కంటే ఎక్కువ ద్రోహం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో తాగునీటికి ఇబ్బందే లేదు అంటున్నారు.. అసలు ఆయన హైదరాబాద్ లో ఉంటున్నాడా? ఆకాశంలో ఉంటున్నాడా? ఎక్కడ ఉంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదని విమర్శించారు. వీళ్ళు సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

''ముఖ్యమంత్రి ఒక మాట చెప్తారు, మంత్రులు మరో మాట చెప్తారు. అక్టోబర్ నెలలో హైదరాబాద్ లో 2లక్షల 50వేల ట్యాంకర్లు బుక్ అయ్యాయి. కనీసం నీటి పారదల శాఖ మంత్రికి సోయి ఉందా? రోజుకి 8వేల ట్యాంకర్లు హైదరాబాద్ లో ఇవాళ బుక్ అవుతున్నాయి. అలాంటి పరిస్థితి ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నాగార్జున సాగర్ లో 510 అడుగుల కింద బొక్కగొట్టి నీళ్లు తీసుకొని పోతుంటే మంత్రికి సోయి లేదు. నల్లగొండ జిల్లాలో జరుగుతున్న జల దోపిడీకి అడ్డుకట్ట వేసే తెలివి లేదు.

250 టీఎంసీల కృష్ణా నీళ్ళు ఆంధ్రార్పణం

తాగునీరు లేక స్కూళ్లు, హాస్టల్స్ కు సెలవులు ఇచ్చి పిల్లలను ఇంటికి పంపిస్తున్నారు. అయినా సిగ్గు లేకుండా మంత్రి మాట్లాడతారు. 250 టీఎంసీల కృష్ణా నీళ్ళు ఆంధ్రార్పణం, సముద్రార్పణం చేశారు. తెలంగాణకు మాత్రం నీళ్లు లేకుండా చేశారు. ఇవాళ పాలమూరును ఎండపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు 730 కిలోమీటర్ల అవతల ఉన్న కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకుపోయారు. 70 కిలోమీటర్ల పరిధిలో మొత్తం పాలమూరు జిల్లా ఉంటే పాలమూరు బిడ్డ అని చెప్పుకునే మీకు సిగ్గు అనిపిస్తలేదా? పంపులు ఆన్ చేయలేదు. ఈ మొత్తం సంవత్సరం కనీసం శ్రీశైలంలో జూరాల దగ్గర మొత్తం కలిపితే 50 టీఎంసీల నీళ్లు కూడా ఎత్తిపోయలేదు. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకోటి ఉంటుందా?

ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలి

ఏపీ జలదోపిడీని అడ్డుకునే దానికి కేఆర్ఎంబీ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించిందా? ప్రత్యేకమైన చర్య తీసుకుందా? మిగిలిన 40 టీఎంసీల నీటిని తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని, ఏపీ నీటి తరలింపునకు అడ్డుకట్ట వేయాలని కేఆర్ఎంబీకి ఏమైనా రేవంత్ ప్రభుత్వం ఉత్తరం రాసిందో లేదో చెప్పాలి'' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తర్వాత చదవండి