తెలంగాణ

TelanganaLandResurvey: భూముల రీసర్వేలో ఎక్కువ విస్తీర్ణం తేలితే..? రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు!

6 నిమిషాల పఠనం

తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యవసాయ, సర్కారు భూముల సమగ్ర రీ సర్వేపై రాష్ట్ర రెవెన్యూ శాఖ అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రీ సర్వే కొలతల్లో ఏ రైతుకైనా పాసుపుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ విస్తీర్ణం తేలితే, ఆ అదనపు భూమిని తమదేనంటూ ఎవరూ యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేయడానికి వీలేదని నిబంధనల్లో తేల్చిచెప్పింది.

 తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యవసాయ, సర్కారు భూముల సమగ్ర రీ సర్వే(LandResurvey)పై రాష్ట్ర రెవెన్యూ శాఖ అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రీ సర్వే కొలతల్లో ఏ రైతుకైనా పాసుపుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ విస్తీర్ణం తేలితే, ఆ అదనపు భూమిని తమదేనంటూ ఎవరూ యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేయడానికి వీలేదని నిబంధనల్లో తేల్చిచెప్పింది. సర్వే ముగిసిన అనంతరం క్షేత్రస్థాయిలో రైతులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.

 రికార్డుల కంటే అదనంగా ఉన్న విస్తీర్ణాన్ని సదరు రైతుల నుంచి వెనక్కి తీసుకుని, నిబంధనల ప్రకారం అర్హులై భూమి తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న ఇతర రైతులకు చట్టబద్ధంగా సర్దుబాటు చేయాలని రెవెన్యూ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాత పహాణీలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఉన్న సర్కారు భూములు, పోరంబోకు, బంచరాయి జాగల విస్తీర్ణాన్ని రీ సర్వేలో గుర్తించిన భూమితో క్షుణ్ణంగా సరిపోల్చాలని అధికారులు ఆదేశించారు.

 గ్రామాల్లోని పాత నక్షాలు, రికార్డుల ప్రకారం ప్రభుత్వ స్థలాల హద్దులను ఎక్కడా ఆక్రమణలకు గురికాకుండా పక్కడ్బందీగా రక్షించాలని సూచించారు. తహశీల్దార్లు క్షేత్రస్థాయి రికార్డులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే రైతులకు సెక్షన్ 9(2) నోటీసులు జారీ చేయాలని తేల్చిచెప్పారు. ఈ నోటీసులపై రైతులకు విస్పష్టంగా అవగాహన కల్పించాలని, కొలతలపై సందేహాలుంటే అభ్యంతరాలు ఎలా దాఖలు చేయాలో అర్ధమయ్యేలా వివరించాలని పేర్కొన్నారు.

 తుది నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఆర్డీవో, అదనపు కలెక్టర్లు స్వయంగా రికార్డులను పరిశీలించి ధృవీకరించాలని ఆదేశించారు. భూముల వద్దకు వెళ్లి గ్రౌండ్ ట్రూటింగ్ చేసినప్పుడు రికార్డులకు, వాస్తవ విస్తీర్గానికి మధ్య తేడాలు కనిపిస్తే, ఫీల్డ్ రిజిస్టర్‌లో ప్రతి ఎంట్రీ దగ్గర సరైన కారణాలు విధిగా నమోదు చేయాలని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా తెల్లకాగితాలపై రాసుకున్న సదాబైనామ లావాదేవీలు, ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విరాసత్, మ్యూటేషన్ల విషయంలో విస్తీర్ణం తేడాలు ఎందుకు వచ్చాయో రికార్డుల్లో స్పష్టంగా రాయాలని పేర్కొంది.

 రాష్ట్రంలో తొలి విడతగా 2,720 గ్రామాల్లో రీ సర్వే చేపట్టగా, ఇప్పటికే వెయ్యికి పైగా గ్రామాల్లో పనులు ప్రారంభమై 416 గ్రామాల్లో విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు ఇచ్చే చేను నక్షాల (ల్యాండ్ పార్సెల్ మ్యాప్ - ఎల్పీఎం) విషయంలో వివాదాలు రాకుండా తగిన సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధ్యమైనంత వరకు ప్రతి రైతుకూ విడివిడిగా వ్యక్తిగత ఎల్పీఎంలు తయారు చేయాలని, అన్నదమ్ములు లేదా ఇతరులకు కలిపి ఉమ్మడి మ్యాపులు ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేసింది.

 గతంలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్, లావణి పట్టాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, ఏ తేదీన ఎంత విస్తీర్ణం ఇచ్చారో పక్కా వివరాలతో నమోదు చేయాలని సూచించింది. గ్రామంలో సర్వే పనులు పూర్తయిన వెంటనే రికార్డులు, ఖాతాల వివరాలను మండల స్థాయిలో 'భూ భారతి' పోర్టల్‌లో వంద శాతం డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించింది.

#TelanganaLandResurvey2026#RevenueDepartmentGuidelinesLandSurvey#TelanganaPataBhoomuluSurplus#LandParcelMapBhuharathi#AndhraPradeshNewsTelugu#TelanganaNewsTelugu#HydNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి