AP : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన ఓ భక్త దంపతులు భారీ కానుకను సమర్పించారు. ఏకంగా రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో దాతలు వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు ఈ ఆభరణాలను అప్పగించారు.
స్వామివారి నిత్య అలంకరణ కోసం అత్యంత సుందరంగా, సాంప్రదాయబద్ధంగా తయారు చేయించిన మొత్తం 46 రకాల దివ్యాభరణాలను ఈ దంపతులు కానుకగా ఇచ్చారు. ఇందులో బంగారు కిరీటం, ముఖపట్టి, శంఖు చక్ర కవచాలతో పాటు వైకుంఠ హస్తం, కటి హస్తం, కౌస్తుభం, శ్రీవత్సం, సూర్య కఠారి వంటి విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు అష్టోత్తర శత కాసుల మాల, చతుర్భుజ లక్ష్మీ హారం, తులసిపత్ర, అశ్వత్థ పత్ర, శాలిగ్రామ హారాలు, ఐదు పేటల కంఠెలు, నాగాభరణ వడ్డాణాలు, భుజకీర్తులు, అందెలు, పాద కవచాలను స్వామివారికి సమర్పించారు.
ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కానుకగా ఇవ్వడం తిరుమల చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. స్వామివారిపై తమకున్న అపారమైన భక్తితో కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని సమర్పించిన చెన్నై దంపతులు వర్ధమాన్ జైన్, రాధిక జైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీటీడీ అధికారులు, భక్తులు అభినందించారు.
