Cm Revanth: కృష్ణా జలాల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. కృష్ణా జలాలను కేసీఆర్ జగన్ కి రాసిచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ కావాలని కేసీఆర్ అన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే ఇవాళ కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయని రేవంత్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తై ఉంటే ఇవాళ నీళ్లు ఎత్తిపోసుకునే వాళ్లమన్నారు.
కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలు అని సంతకం చేశారు
ఏపీ ప్రభుత్వం ముచ్చుమర్రి, రాయలసీమ, హంద్రీనీవా, మాల్యాల ప్రాజెక్టులు పూర్తి చేసుకుందని తెలిపారు. జగన్ ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్ ఆయనకు గులాంగిరి చేశారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 11వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచుకున్నారని చెప్పారు. జగన్ పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేస్తుంటే.. మామ, అల్లుడు చూస్తూ కూర్చున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలు అని సంతకం చేసి.. తెలంగాణకు ఉరివేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. అచ్చంపేటలో బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.
పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
''కేసీఆర్ కు అధికారం ఇస్తే తన కుటుంబసభ్యులు, బంధువులకు పదవులు ఇచ్చుకున్నారు. అధికారం పోగానే ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. అధికారం లేకుంటే బయటకు రాకూడదా? అధికారం లేకుంటే ప్రజల తరఫున ఏమైనా అడగకూడదా? కేసీఆర్ కు పదేళ్లు అధికారం ఇస్తే రూ.8.50లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దీనస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు.
ప్రాజెక్టుల పేరుతో రూ.1.80లక్షల కోట్లు ఖర్చు
మహిళలకు పంచిన బతుకమ్మ చీరల్లో కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు. సూరత్ నుంచి కిలో చొప్పున చీరలు తెచ్చి మహిళలకు పంచారు. కేసీఆర్ ప్రభుత్వం పంచిన చీరలు చేలకు చుట్టేందుకు మాత్రమే పనికొచ్చాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్ పదేళ్లపాటు పడావు పెట్టారు. ప్రాజెక్టుల పేరుతో రూ.1.80లక్షల కోట్లు ఖర్చు చేశారు. రూ.1.80 లక్షల కోట్లలో పాలమూరు ప్రాజెక్టుల కోసం రూ.10వేలు కూడా ఖర్చు చేయలేదు.
నెహ్రూ ముందుచూపుతో ధాన్యం కొరత లేకుండా పోయింది
పాలమూరు బిడ్డగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అచ్చంపేట ప్రాంతాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. మా ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే ఈనాడు లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తున్నాయి. నెహ్రూ ముందు చూపుతో ఇవాళ దేశానికి ధాన్యం కొరత లేకుండా పోయింది'' అని రేవంత్ రెడ్డి అన్నారు.
