TG: సినిమాల్లో మాత్రమే చూసే వెట్టిచాకిరీ, బానిస బతుకులు ఇంకా సమాజంలో సజీవంగానే ఉన్నాయని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టింది. అప్పు పేరుతో ఉచ్చు బిగించి, ఏకంగా 8 కుటుంబాలను 14 ఏళ్ల పాటు నరకయాతనకు గురిచేసిన ఓ సిమెంట్ ఇటుకల కేంద్రం యజమాని దుర్మార్గం తాజాగా బయటపడింది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బందీలుగా మారిన 37 మందికి ఎట్టకేలకు అధికార యంత్రాంగం విముక్తి కల్పించింది.
అప్పు ఉచ్చులో 14 ఏళ్ల నరకయాతన!
నెల్లూరు జిల్లాకు చెందిన 8 దళిత కుటుంబాలు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల కిందట హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రంలో పనికి చేరాయి. ఆ సమయంలో యజమాని వారికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. ఆ కొద్దిపాటి అప్పే వారి పాలిట శాపంగా మారింది. అప్పు తీరలేదంటూ వారిని అక్కడే బందీలుగా మార్చేశాడు. తెల్లవారుజామునే నిద్రలేపి, ఎండనకా వాననకా, చేతులు పగిలి రక్తం కారుతున్నా విశ్రాంతి లేకుండా ఇటుకల మట్టిని తొక్కించేవాడు. ఇంత కష్టపడి వారమంతా పనిచేస్తే ఒక కుటుంబానికి ఇచ్చేది కేవలం రూ. 600 మాత్రమే. ఎవరికీ తమ గోడు చెప్పుకోకుండా ఉండేందుకు వారి ఫోన్లలోని సిమ్ కార్డులను సైతం లాక్కొని బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేశాడు.
అర్ధరాత్రి అధికారుల మెరుపు దాడి!
పద్నాలుగేళ్లుగా సాగుతున్న ఈ నరకయాతన గురించి ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందింది. వెంటనే వారు కమలాపూర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తహసీల్దార్ సురేష్ కుమార్ ఆదేశాలతో అధికారులు అర్ధరాత్రి ఆ ఇటుకల కేంద్రంపై మెరుపు దాడి చేశారు. ఆర్ఐ ఫజిల్, గ్రామ పాలన అధికారి కంది శిరీష రెడ్డి, కమలాపూర్ సీఐ నవీన్, కార్మిక శాఖ, బాలల సంరక్షణ అధికారి సునీత, సీడబ్ల్యూసీ అధికారి జయవర్ధన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు రేణుక, రమాదేవి బృందం కలిసి ఆ కేంద్రాన్ని జల్లెడ పట్టారు.
14 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు
ఈ తనిఖీల్లో 8 కుటుంబాలకు చెందిన 9 మంది పురుషులు, 11 మంది మహిళలు, 17 మంది చిన్నారులు కలిపి మొత్తం 37 మంది బానిస బతుకులు గడుపుతున్నట్లు గుర్తించారు. వారందరినీ అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి 14 ఏళ్ల బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించారు. ఆ రాత్రి వారంతా మొదటిసారి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయారు. మరుసటి రోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విముక్తి పత్రాలు అందుకుని, 14 ఏళ్ల తర్వాత దొరికిన స్వేచ్ఛను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. సకాలంలో స్పందించి 37 మందికి పునర్జన్మ ప్రసాదించిన అధికారులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
