తెలంగాణ

రాజధాని చుట్టే 59 ఎమ్మెల్యే సీట్లు.. డీలిమిటేషన్ తర్వాత హైదరా.. బాద్‍షా!

డీలిమిటేషన్ తర్వాత తెలంగాణ పొలిటికల్ పిక్చరే మారిపోతుందని చెప్పుకుంటున్నాం. అంతే కాదు.. హైదరాబాద్ కూడా కింగ్ మేకర్ లాగా మారబోతోంది. అవును.. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే.. మన రాజధాని ప్రాధాన్యత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. రాజధాని చుట్టే 59 ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి.

తెలంగాణలో ఇక హైదరాబాదే కింగ్ మేకర్

డీలిమిటేషన్ తర్వాత మరింత పెరగనున్న ప్రాధాన్యత

హైదరాబాద్ చుట్టూ ఏకంగా 59 ఎమ్మెల్యే సీట్లు

రాజకీయాలను శాసించే కొత్త పవర్ సెంటర్‌గా హైదరాబాద్!

డీలిమిటేషన్ తర్వాత తెలంగాణ పొలిటికల్ పిక్చరే మారిపోతుందని చెప్పుకుంటున్నాం. అంతే కాదు.. హైదరాబాద్ కూడా కింగ్ మేకర్ లాగా మారబోతోంది. అవును.. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే.. మన రాజధాని ప్రాధాన్యత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలున్నారు. రేపు ఈ సంఖ్య 179కి చేరితే? 182కు పెరిగితే? మరి ఈ పెరిగే స్థానాల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే 50కి పైగా సీట్లు వస్తే? తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ ప్రాధాన్యం ఏ స్థాయికి చేరుతుంది? డీలిమిటేషన్ నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఇదే.

కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక అడుగులు వేస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనతో కొత్త రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లు కీలకం కానుంది. బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ సీట్లు 179 నుంచి 182 వరకు పెరగవచ్చనే అంచనాలున్నాయి. లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు చేరవచ్చని చెబుతున్నారు. అయితే ఈ మొత్తం మార్పులో అత్యంత ఆసక్తికరమైన అంశం హైదరాబాద్ చుట్టూ ఏర్పడే కొత్త రాజకీయ సమీకరణాలే.

హైదరాబాద్ చుట్టూ 59 సీట్లు వస్తాయా?

హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలను కలిపి చూస్తే డీలిమిటేషన్ తర్వాత సుమారు 59 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఆ అంచనాల ప్రకారం జిల్లాలవారీగా పరిస్థితి ఇలా ఉండవచ్చు.

హైదరాబాద్: ప్రస్తుతం 15 స్థానాలు. ఇవి 20 కి పెరగవచ్చు.

మేడ్చల్–మల్కాజిగిరి: ప్రస్తుతం 5 స్థానాలు. పెరిగి 13 కావచ్చు.

రంగారెడ్డి: ప్రస్తుతం 8 స్థానాలు. పెరిగి 13 కు చేరవచ్చు.

వికారాబాద్: మరో స్థానం పెరిగి సుమారు 5 కావచ్చు.

సంగారెడ్డి: ప్రస్తుతం 5 స్థానాలు. పెరిగి 8 కావచ్చు.

ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న 37 స్థానాలు దాదాపు 59కి చేరవచ్చు. అంటే ఒక్క ఈ ప్రాంతంలోనే 22 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ లెక్కలే నిజమైతే తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రాధాన్యం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

50కి పైగా ఎమ్మెల్యేలు.. హైదరాబాద్‌దే రాజకీయ హవా?

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 179 నుంచి 182కు పెరిగితే, హైదరాబాద్ మెట్రో ప్రాంతంలోని ఐదు జిల్లాల్లోనే సుమారు 59 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో దాదాపు మూడో వంతు ఈ ప్రాంతానికే దక్కే పరిస్థితి రావచ్చు. ఇది కేవలం నంబర్ల మార్పు కాదు. రాష్ట్ర రాజకీయాల్లో అధికార సమీకరణాలను ప్రభావితం చేయగల పరిణామం.

ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణకు ఐటీ, వ్యాపార, ఆర్థిక కేంద్రం. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక కార్యకలాపాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. రేపు రాజకీయ ప్రాతినిధ్యం కూడా అదే స్థాయిలో పెరిగితే హైదరాబాద్ చుట్టూ కొత్త పవర్ సెంటర్ ఏర్పడే అవకాశం ఉంది.

గచ్చిబౌలి నుంచి బాచుపల్లి వరకు కొత్త రాజకీయ పోటీ

హైదరాబాద్ చుట్టూ జనాభా పెరుగుతున్న తీరు చూస్తే కొత్త నియోజకవర్గాల అవసరం ఎందుకు ఏర్పడవచ్చో అర్థమవుతుంది. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, చందానగర్, బాచుపల్లి, నార్సింగి, శంషాబాద్, కాప్రా, బోడుప్పల్, కీసర వంటి ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలుగా ఉన్న ఇవి ఇప్పుడు భారీ నివాస, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. ఐటీ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలతో ఈ ప్రాంతాల స్వరూపమే మారిపోయింది.

డీలిమిటేషన్ తర్వాత బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, నార్సింగి, బాచుపల్లి, కాప్రా, బోడుప్పల్, కీసర వంటి ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటివరకు ఒకే నియోజకవర్గం పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలు విడిపోవచ్చు. కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చు. కొత్త నాయకులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు పెరగవచ్చు.

పార్టీలకు కొత్త రాజకీయ యుద్ధభూమి

హైదరాబాద్ చుట్టూ 50కి పైగా ఎమ్మెల్యే స్థానాలు ఏర్పడితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ప్రాంతం మరింత కీలకంగా మారుతుంది. ఇప్పటివరకు ఉన్న నియోజకవర్గాల లెక్కలు మారితే నాయకుల రాజకీయ భవిష్యత్తు కూడా మారవచ్చు. కొత్త ప్రాంతాలు ఒకే నియోజకవర్గంలో కలవొచ్చు. ప్రస్తుత నియోజకవర్గాలు విడిపోవచ్చు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కొత్త అవకాశాలు రావచ్చు.

ముఖ్యంగా పట్టణ ఓటర్లు, కొత్తగా స్థిరపడిన కుటుంబాలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువత ఓటింగ్ సరళి ఎన్నికల్లో కీలకంగా మారవచ్చు. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లోనూ గణనీయమైన ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్ ఒక మినీ తెలంగాణగా మారుతుందా?

తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, వైద్యం కోసం వచ్చిన లక్షలాది మంది ఇక్కడే నివసిస్తున్నారు. అంటే హైదరాబాద్ కేవలం ఒక నగరం కాదు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల సామాజిక, ఆర్థిక నేపథ్యాలను ప్రతిబింబించే మహానగరం.

ఇప్పుడు ఈ ప్రాంతంలోనే సుమారు 59 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే, హైదరాబాద్ రాజకీయంగా ఒక మినీ తెలంగాణగా మారుతుందా అనే ప్రశ్నకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఇప్పటివరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న హైదరాబాద్, రేపు రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుతుందా? తుది లెక్కలు తేలితే దీనిపై మరింత క్లారిటీ వస్తుంది.

కానీ ప్రస్తుత అంచనాలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. 119 స్థానాల తెలంగాణ.. రేపు 179 లేదా 182 స్థానాల తెలంగాణగా మారితే, అందులో హైదరాబాద్ చుట్టూ 59 స్థానాలు ఏర్పడతాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త పవర్ సెంటర్ ఏర్పడినట్టే. భవిష్యత్ లో మన హైదరాబాద్ ఓ ముంబైలాగా వెలుగు వెలిగే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట.

తర్వాత చదవండి