ఏపీ

తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ కుటుంబం భారీ బంగారు కానుకను సమర్పించింది. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా అందజేయగా, వీటి విలువ సుమారు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ కుటుంబం భారీ బంగారు కానుకను సమర్పించింది. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా అందజేయగా, వీటి విలువ సుమారు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో దాత కుటుంబ సభ్యులు ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

తిరుమల చరిత్రలో ఒక భక్తుడు సమర్పించిన అతిపెద్ద బంగారు కానుకల్లో ఇదొక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఈ భారీ కానుకలో మొత్తం 47 రకాల బంగారు ఆభరణాలను 9 ప్రత్యేక సెట్‌లుగా రూపొందించారు. స్వామివారికి అలంకరించే కిరీటం, వడ్డాణం, భుజాభరణాలు, శంఖుచక్రాలు, అభయ హస్తాలు వంటి ఆభరణాలు ఇందులో ఉన్నాయి. ఆగమ శాస్త్ర నియమాలు, టీటీడీ సంప్రదాయాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దారు.

శ్రీవారు నిత్యం సుమారు 120 కిలోల బంగారు ఆభరణాలను ధరిస్తుండగా, స్వామివారి నిత్య అలంకరణకు ఉపయోగపడేలా సరిగ్గా 121 కిలోల ఆభరణాలను సమర్పించడం విశేషం. రేపటి నుంచే ఈ కొత్త ఆభరణాలతో స్వామివారిని అలంకరించనున్నారు. వర్ధమాన్ జైన్ కుటుంబం టీటీడీకి విరాళం అందించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే 16న కూడా టీటీడీకి ఒక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా జైన్ దంపతులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందమని, మరెక్కడా లభించని దివ్యానూభుతి ఇక్కడ దొరుకుతుందని పేర్కొన్నారు. దేవుని ఆదేశంతోనే 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చామని జైన్ దంపతులు తెలిపారని, ప్రతిరోజూ శ్రీవారికి 120 కిలోల బంగారు ఆభరణాలు ధరిస్తారని చంద్రబాబు గుర్తుచేశారు.

తర్వాత చదవండి