ఆధునిక జీవనశైలి విధానాల వల్ల చాలా మంది చిన్నతనంలోనే హెయిర్ లాస్ అవుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం, నిద్రలేని రాత్రులు గడపడం, ఆహారపు అలవాట్లు, నీరు ఎక్కువగా తీసుకోకపోవడం, కలుషిత వాతావరణం కారణంగా త్వరగా జుట్టు తెల్లబడటంతో పాటు రాలే సమస్య చాలా మంది వేధిస్తోంది. దీంతో యువతీయువకులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. దీంతో జట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయుర్వేద చిట్కాలు పాటించడంతో పాటు హెయిర్ స్పెషలిస్టులను సైతం కన్సల్ట్ అవుతున్నారు.అయితే, ఫ్లాక్స్ సీడ్స్ తినడం వలన జుట్టు రాలే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అని చాలా మంది యూట్యూబ్,గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్టు తెలిసింది. నిజంగానే ఫ్లాక్స్ సీడ్స్ తినడం వలన జుట్టు రాలే సమస్యల తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పడు తెలుసుకుందాం..
కొంతమేలు చేయొచ్చు.. కానీ..
అవిసె గింజలు (flax seeds) తింటే జుట్టు ఆరోగ్యానికి కొంత మేలు జరగవచ్చు.కానీ అవి తింటే కొత్త జుట్టు తప్పకుండా పెరుగుతుందని, జుట్టు రాలడం ఆగిపోతుందని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని తెలుస్తోంది. అవిసె గింజల్లో జుట్టుకు ఉపయోగపడే కొన్ని పోషకాలు ఉంటాయి. జుట్టు పెరుగుదల అనేది పోషకాహారం మాత్రమే కాకుండా జన్యువులు, హార్మోన్లు, తల చర్మ ఆరోగ్యం, ఐరన్ స్థాయులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అవిసెల్లో ఉండే ప్రధాన పోషకాలు..
- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఇది శరీరంలో సాధారణ ఆరోగ్యానికి, కణాల పనితీరుకు ఉపయోగపడుతుంది.
- జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. తగిన ప్రోటీన్ తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం.
- యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్న లిగ్నాన్స్ మొక్కల సమ్మేళనాలు తీసుకోవాలి
- జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఈ పోషకాలు ఉన్నంత మాత్రాన జుట్టు కుదుళ్లను నేరుగా ప్రేరేపించి కొత్త జుట్టు పెంచుతాయని నిరూపణ కాలేదని తెలిసింది.
నిపుణులు ఏమంటున్నారు?
-జుట్టు రాలడానికి కారణం తెలుసుకోవాలి.
-ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు లోపిస్తే వాటిని సరిచేయాలి.
-అవసరం లేకుండా హెయిర్ గ్రోత్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు.
-జుట్టు పలుచబడటం లేదా ఎక్కువగా రాలడం ఉంటే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.
అమెరికన్ డెర్మటాలజిస్టుల సూచన ప్రకారం.. పోషక లోపం వల్ల జుట్టు రాలితే ఆ లోపాన్ని సరిచేయడం ఉపయోగపడుతుంది. కానీ సాధారణ స్థాయిలో ఉన్న పోషకాలను అదనంగా తీసుకోవడం వల్ల జుట్టు తప్పనిసరిగా పెరుగుతుందని చెప్పలేం.
రోజుకు ఎన్ని అవిసె గింజలు తినొచ్చు?
సుమారు 7–10 గ్రాముల గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్స్‌ను ఆహారంలో కలిపి తీసుకోవచ్చు.
-గింజలను స్వల్పంగా వేయించి చల్లార్చి పొడి చేసుకోని తినొచ్చు.
-రాగి అంబలి, పెరుగు, ఓట్స్ లేదా పాలలో కలుపుకుని తీసుకోవచ్చు.
-పూర్తిగా గింజల రూపంలో కాకుండా పొడి చేసి తీసుకుంటే జీర్ణం కావడానికి,పోషకాలు అందడానికి అనుకూలంగా ఉంటుంది.
-నీరు తగినంత తాగాలి. మీకు గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అజీర్ణం ఉంటే తక్కువ పరిమాణంతో ప్రారంభించాలి. ఎక్కువగా తీసుకుంటే ఉబ్బరం, కడుపు నిండిన భావన,విరేచనాలు అయ్యే చాన్స్ ఉంది.
ఐరన్, ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం..
-ప్రోటీన్ కోసం గుడ్లు, పప్పులు, చేపలు, చికెన్ తినాలి. ఐరన్ కోసం ఆకుకూరలు, పప్పులు, మాంసం తీసుకోవాలి. విటమిన్ B12 తగ్గినా జుట్టు రాలుతుంది. అందుకు గుడ్లు, చేపలు, పాలు, మాంసం తప్పకతీసుకోవాలి. జింక్ కోసం గుమ్మడి గింజలు, పప్పులు, గింజలు తీసుకోవాలి.
ఒమేగా-3 కోసం ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ తినాలి. జుట్టు ఎక్కువగా రాలితే డాక్టర్ సూచనల మేరకు సప్లిమెంట్స్ వాడాలి. సొంతంగా వాడొద్దు.
