ACB: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ సర్కిల్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా (ADE) పనిచేస్తున్న రమేష్ బాబు రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బిల్లులు చెల్లించాలంటే లంచం ఇవ్వాల్సిందేనని రమేష్ బాబు కాంట్రాక్టర్ ని డిమాండ్ చేశాడు. అధికారి తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
గురువారం సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఏడీఈ.. లంచం డబ్బును తన కారులో పెట్టమని కాంట్రాక్టర్‌కు చెప్పాడు. దాంతో అతడు 60 వేలు కారులో పెట్టాడు. ఏడీఈ కారులో బయలుదేరి వెళ్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. అధికారిని పట్టుకున్నారు. కాగా, విద్యుత్ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ADE రమేష్ బాబుపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. లంచం తీసుకుంటూ ADE పట్టుబడటం సంబంధిత శాఖలో కలకలం రేపింది.
''రూ.12.62 లక్షల విలువైన పెండింగ్ పనుల బిల్లులను ప్రాసెస్ చేయడానికి ఒక కాంట్రాక్టర్ నుండి రూ.60వేలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL)కు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌ను గద్వాల్లో అరెస్ట్ చేశాం. నిందితుడు అన్నారపు రమేష్ బాబు ఇంటికి వెళ్తుండగా లంచం డబ్బును తన కారు డాష్‌బోర్డ్‌పై ఉంచమని కాంట్రాక్టర్‌తో చెప్పాడు. అతడు చెప్పినట్లే కాంట్రాక్టర్ డబ్బుని కారులో ఉంచాడు. మేము ట్రాప్ చేసి అధికారిని పట్టుకున్నాం. లంచం డబ్బును సీజ్ చేశాం'' అని ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు చేసి పెట్టేందుకు ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే... తమ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1064 ద్వారా తెలియజేయాలని ఏసీబీ అధికారులు ప్రజలను కోరారు. 9440446106 వాట్సాప్ నెంబర్, బ్యూరో అధికారిక సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా కూడా ఫిర్యాదులు పంపొచ్చని.. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
