Natural Skin Care: మెడ, ముఖం లేదా శరీరంపై వచ్చే పులిపిర్లు చూడటానికి ఎంతో ఇబ్బందిగా ఉంటాయి. గోధుమ రంగులో లేదా నల్లగా కనిపించే ఇవి.. చర్మంపై ఇన్ఫెక్షన్లు, వైరస్లు లేదా ఒంట్లో విటమిన్ల లోపం వల్ల పుట్టుకొస్తుంటాయి. మొదట్లో చిన్నగా ఉన్నా, రోజులు గడిచేకొద్దీ సైజు పెరిగి దురద, చికాకు కలిగిస్తాయి. వీటిని వదిలించుకోవడానికి చాలామంది వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీములు వాడటం, లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం చేస్తుంటారు. కానీ పైసా ఖర్చు లేకుండా, చర్మంపై ఎలాంటి మచ్చ కూడా పడకుండా ఇంట్లోనే పులిపిర్లను రాలగొట్టే ఒక అద్భుతమైన చిట్కా ఉంది.
కావాల్సిన మూడు పదార్థాలు ఇవే
ఈ చిట్కా కోసం మనకు అందుబాటులో ఉండే మూడు సాధారణ వస్తువులు ఉంటే చాలు. తడి సున్నం అనేది పులిపిర్లు త్వరగా ఎండిపోయి రాలిపోవడానికి బాగా పనిచేస్తుంది. అలాగే వంట సోడా కూడా పులిపిరిని తొలగించడమే కాకుండా, అది ఊడిపోయాక ఎలాంటి నల్లటి మచ్చ లేకుండా చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఈ చిట్కాలో పచ్చి బొప్పాయి పాలు అసలైన, పవర్ఫుల్ పదార్థం. పచ్చి బొప్పాయి కాయపై చిన్నగా గిల్లితే వచ్చే పాలను సేకరించాలి. ఇది పులిపిరిని వేగంగా రాలగొట్టడంలో కీలకంగా పనిచేస్తుంది.
పేస్ట్ తయారు చేసే విధానం
ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని, అందులో కొద్దిగా తడి సున్నం వేయండి. ఇప్పుడు అందులో ఒక చిటికెడు వంట సోడా కలపండి. చివరగా సుమారు అర టీస్పూన్ పచ్చి బొప్పాయి పాలు వేసి, ఈ మూడు పదార్థాలు బాగా కలిసేలా మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోండి.
ఎలా వాడాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే..
తయారు చేసుకున్న ఈ పేస్ట్‌ను పులిపిరి ఎక్కడైతే ఉందో, దాని చుట్టూ, పులిపిరి చర్మానికి అంటుకుని ఉన్న మొదలు భాగంలో జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడు దీనికి చుట్టుపక్కల ఉన్న మంచి చర్మానికి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వీలును బట్టి రోజుకు 1 నుంచి 3 సార్లు ఈ పేస్ట్‌ను పెట్టుకోవచ్చు. రాసిన తర్వాత కనీసం ఒక గంట పాటు అలాగే ఆరనిచ్చి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. పులిపిరి చిన్నదైతే ఈ చిట్కాతో చాలా త్వరగా రాలిపోతుంది. ఒకవేళ పెద్దదైతే ఊడిపోవడానికి కొద్దిగా సమయం పట్టొచ్చు కానీ, ఎలాంటి మచ్చ లేకుండా పూర్తిగా పోతుంది.
నోట్: చర్మం మరీ సున్నితంగా ఉండేవాళ్లు, ముఖ్యంగా కళ్ల చుట్టూ పులిపిర్లు ఉన్నవాళ్లు ఈ మిశ్రమాన్ని వాడే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
