క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ధూమమానం, మద్యపానం చేసే వారు క్యాన్సర్ బారిన పడితే ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్న వారు సైతం ఈ ప్రాణాంతక వ్యాధికి గురవుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారిలో ఎక్కువగా యువత, మిడిల్ ఏజ్ గ్రూపు వారే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR - NCDIR) విడుదల చేసిన 'తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ -2026', క్యాన్సర్ అట్లాస్ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో 19 ఏళ్లు పైబడిన యువతలో ఏడాదికి 46,762 కొత్త క్యాన్సర్ కేసులు నమోదైనట్టు అంచనా వేశారు. ఇక గతేడాది మొత్తం 53,565 కేసులు నమోదైనట్టు సమాచారం. 2026లో నమోదైన కొత్త కేసుల్లో మహిళల సంఖ్య 25,510 ఉండగా, పురుషుల సంఖ్య 21,252గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు సగటున ఏడాదికి 52 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి.
క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ఎలా?
క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభం కానుంది. ప్రాణాలకు ముప్పు తగ్గుతుంది. లక్షణాలు లేకపోయినా వయస్సు, కుటుంబ చరిత్ర, జీవనశైలి ఆధారంగా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తుగా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఉండి టెస్టుల్లో బయటపడకపోయినా వ్యాధి ముదిరినసమయంలో ఎలా గుర్తించాలంటే..
బరువు తగ్గడం : డైటింగ్ లేదా వ్యాయామం లేకుండా అకస్మాత్తుగా 5 కిలోలకు పైగా బరువు తగ్గడం..
గడ్డలు, వాపులు : చర్మం కింద, రొమ్ము, మెడ లేదా చంక భాగాల్లో కొత్త గడ్డలు లేదా వాపులు ఏర్పడటం.
రక్తస్రావం మార్పులు : మలంలో లేదా మూత్రంలో రక్తం కనిపించడం, కఫంలో రక్తం రావడం, ఋతుస్రావం కాని టైంలో అసాధారణ రక్తస్రావం.
జీర్ణ, మూత్ర సమస్యలు : రెండు వారాలకు మించి మలబద్ధకం లేదా విరేచనాలు, మింగడంలో ఇబ్బంది, మూత్ర విసర్జనలో మార్పులు.
చర్మం, గాయాలు : మానని పుండ్లు, పుట్టుమచ్చల రంగు లేదా ఆకారంలో మార్పులు, చర్మం పసుపు రంగులోకి మారడం.
శీరీరం మనకిచ్చే పరోక్ష సంకేతాలు..
తీవ్రమైన అలసట : తగినంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని నీరసం, రక్తహీనత కారణంగా వచ్చే బలహీనత.
జ్వరం, రాత్రి చెమటలు : స్పష్టమైన ఇన్ఫెక్షన్ లేకుండా మళ్లీ మళ్లీ జ్వరం రావడం లేదా రాత్రి వేళల్లో అధికంగా చెమట పట్టడం.
నొప్పులు : కారణం లేకుండా కీళ్లు, వెన్ను లేదా శరీరంలోని ఇతర భాగాల్లో నిరంతర నొప్పి ఉండటం.
క్యాన్సర్ గుర్తించేందుకు ముందస్తు టెస్టులు..
రక్త పరీక్షలు : పూర్తి రక్త పరీక్ష, నిర్దిష్ట ట్యూమర్ మార్కర్ల పరిశీలన.
స్క్రీనింగ్ పరీక్షలు : రొమ్ము క్యాన్సర్ కోసం మమోగ్రఫీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం పాప్ స్మియర్ లేదా హెచ్పివి పరీక్ష, పెద్దప్రేగు సమస్యల కోసం కొలనోస్కోపీ లేదా మల పరీక్ష.
ఇమేజింగ్ పరీక్షలు : అల్ట్రాసౌండ్, ఎక్స్-రే, సిటి స్కాన్, ఎంఆర్ఐ, లేదా పెట్ స్కాన్ ద్వారా అంతర్గత అవయవాల స్థితిని చూడటం.
బయాప్సీ : అనుమానిత కణజాలం లేదా ద్రవాన్ని సేకరించి మైక్రోస్కోప్‌లో పరీక్షించడం. ఇది క్యాన్సర్‌ను నిర్ధారించే ప్రధాన పరీక్ష.
పైన చెప్పిన అనారోగ్య సమస్యల్లో రెండు వారాలకు మించి కొనసాగడం, మెడిసిన్ వాడినా తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి సంబంధిత పరీక్షలు చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
